టిడిపి నేత కారుకు నిప్పు

May 25,2024 23:14 #car, #fire, #Tdp Leader
  • ముగ్గురు నిందితుల అరెస్టు

ప్రజాశకి- యంత్రాంగం : ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలంలో టిడిపి నేత కారును గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్థరాత్రి తగలబెట్టారు. మూలగుంటపాడు చెందిన టిడిపి నేత, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నాయకులు చిగురుపాటి శేషగిరిరావు రోజులాగే కారును తన ఇంటి ముందు పార్క్‌ చేశారు. అర్థరాత్రి 12:30 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కారుపై పెట్రోలు పోసి నిప్పు అంటించారు. ఇది గమనించిన శేషగిరిరావు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సిసి కెమెరాల్లో పుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు.
కారు తగులబెట్టిన కేసు చేధించిన పోలీసులు
కారు తగులబెట్టిన కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి ఓ బైకును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు వివరాలను అదనపు ఎస్‌పి(క్రైం) ఎస్‌వి.శ్రీధరరావు శనివారం మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మూలగుంటపాడుకు చెందిన లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ చిగురుపాటి శేషగిరిరావు తన ఇంటి వద్ద పార్కు చేసిన కారుపై పాలేటి అభిషేక్‌, మరో బాలుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. చుట్టుపక్కల వారు గమనించి కేకలు వేయడంతో వారు అక్కడ నుంచి పారిపోయారు. ఓ స్థల వివాదంలో ఈశ్వర్‌ లాడ్జీ నిర్వాహకుడు కానసాని ఈశ్వర్‌రెడ్డి, అశోక్‌కి మధ్య శేషగిరిరావు మధ్యవర్తిగా ఉన్నారు. వారి మధ్య కుదిరిన ఒప్పంద పత్రాన్ని శేషగిరిరావు వద్ద ఉంచారు. సంబంధిత ఒప్పంద పత్రాలు ఇవ్వాలని ఈశ్వర్‌రెడ్డి అడుగగా, అందుకు శేషగిరిరావు నిరాకరించారు. దీంతో వారి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీన్ని మనసులో పెట్టుకొని ఈశ్వర్‌ రెడ్డి తన దగ్గర పనిచేసే ఓ బాలుడు, అతని స్నేహితుడు అభిషేక్‌ సాయంతో శేషగిరిరావు కారును తగలబెట్టేందుకు పథకం పన్నారు. ఆ పథకం ప్రకారం శుక్రవారం రాత్రి ఈశ్వర్‌రెడ్డి మూడు పెట్రోల్‌ బాటిళ్లను తెచ్చి అభిషేక్‌, బాలుడికి ఇచ్చారు. వారు అర్ధరాత్రి సమయంలో బైకుపై శేషగిరిరావు ఇంటికి వెళ్లారు. ఇంటి ముందు పార్కు చేసిన కారుపై పెట్రోల్‌ పోసి తగులబెట్టి పరారయ్యారు. దర్యాప్తు అనంతరం ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు అదనపు ఎస్‌పి తెలిపారు. ఈ ఘటన కేవలం వ్యక్తిగత ద్వేషంతో జరిగిందని, శేషగిరిరావును భయబ్రాంతులకు గురిచేసి ఒప్పంద పత్రాన్ని తీసుకోడానికి ఈ చర్యకు పాల్పడినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణమూ లేదని పేర్కొన్నారు.

➡️