బిసి నేతలకు టిడిపి విశ్వవిద్యాలయం

Jan 5,2024 10:55 #TDP

జయహో బిసి వర్క్‌షాప్‌లో చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బిసి నాయకులను ఎందరినో తెలుగుదేశం పార్టీ తయారుచేసిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. టిడిపి కార్యాలయంలో గురువారం జరిగిన ‘జయహో బిసి’ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బిసిలకు తెలుగుదేశం పార్టీ ఒక విశ్వవిద్యాలయం లాంటిదని అన్నారు. బిసిలను ఎంఎల్‌ఏలుగానూ, ఎం.పిలుగానూ తయారు చేసిన ఫ్యాక్టరీగా టిడిపిని ఆయన అభివర్ణించారు. ఉన్నత స్థాయిలో ఉండే ప్రతి వందమందిలో 50 మంది బిసిలే ఉండేలా చేసే బాధ్యత తనదని అన్నారు. పన్నుల రూపంలో జగన్‌ బలహీన వర్గాల రక్తం తాగుతున్నారని విమర్శించారు. వైసిపి పాలనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయ సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి బాగుపడ్డారని, జగన్‌ కంపెనీలే లబ్దిపొందాయని ఆరోపించారు. బుద్ధి, జ్ఞానం లేకుండా విద్యుత్‌ చార్జీలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ పనైపోయిందని, మరలా గెలిచే అవకాశం లేదన్నారు. జనాభాలో 50శాతం ఉన్న బిసిలకు రాజకీయ ప్రాధాన్యత, ఆర్ధిక వెసులుబాటు కల్పించి న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్‌, టిడిపి మాత్రమే అని చెప్పారు. స్థానిక సంస్థల్లో 20శాతం రిజర్వేషన్లు ఎన్టీఆర్‌ ప్రవేశపెడితే తాను 34శాతానికి పెంచానని తెలిపారు. వైసిపి ప్రభుత్వం 24శాతానికి తగ్గించి అన్యాయం చేసిందని విమర్శించారు. బిసిలు టిడిపి వెంట ఉన్నారనే అక్కసుతో వారిపై జగన్‌ దండయాత్ర చేస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్‌ ఇచ్చిన కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు నాలుక గీసుకోడానికి కూడా పనికిరావని, ఒక్కరికి కూడా రుణాలు ఇచ్చిన్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. టిడిపి అధికారంలోకి వస్తేనే బిసిలకు అభివృద్ధి ఉంటుందని పొలిట్‌ బ్యూరోసభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్‌ వచ్చాక నిధులు, విధులు లాక్కున్నారని టిడిపి బిసి సాధికార సమితి అధ్యక్షులు కొల్లు రవీంద్ర అన్నారు. పార్టీ నాయకులు కాల్వ శ్రీనివాసులు, గౌతు శిరీష, దువ్వారాపు రామారావు, కొనకళ్ల నారాయణ, గణబాబు, పితాని సత్యనారాయణ, కె శివబాల తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. అనంతరం జయహో బిసి ప్రచార రథాలను జెండా ఊపి చంద్రబాబు ప్రారంభించారు. 175 నియోజకవర్గాల్లో బిసి నేతలు పర్యటించి టిడిపి ఏం చేసింది, మరలా అధికారంలోకి రాగానే ఏం చేయబోతోంది, బిసిలకు జగన్‌ చేసిన అన్యాయం గురించి క్షేత్రస్థాయిలో వివరించాలని చంద్రబాబు చెప్పారు.

➡️