టిడిపి కార్యకర్త హత్య

Mar 19,2024 23:29 #death, #leader, #TDP
  • వైసిపి వారే ఈ దారుణానికి ఒడిగట్టారని ఫిర్యాదు

ప్రజాశక్తి- గిద్దలూరు, గిద్దలూరు రూరల్‌ (ప్రకాశం జిల్లా) : ప్రజాగళం సభకు గ్రామస్తులను తీసుకెళ్లాడనే కారణంతో టిడిపి కార్యకర్తను వైసిపి వారు హత్య చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం… గడికోట పంచాయతీ పరమేశ్వర్‌ నగర్‌కు చెందిన టిడిపి కార్యకర్త పాముల మునెయ్య (39) గిద్దలూరు అటవీ శాఖ పరిధిలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆదివారం జరిగిన చిలకలూరిపేటలోని ప్రజాగళం సభకు గ్రామంలోని పలువురితో కలిసి వెళ్లారు. ఇటీవల మేదరమెట్లలో వైసిపి ఆధ్వర్యాన జరిగిన సిద్ధం సభకు గ్రామం నుంచి ఎక్కువ మంది వెళ్లలేదు. సిద్ధం సభకు రాని వారిని ప్రజాగళం సభకు మునెయ్య తీసుకెళ్లడం పట్ల అదే గ్రామానికి చెందిన వైసిపి నాయకులు గుండాల చిన్న అల్లూరయ్య, అతని కుమారులు గుండాల ఈశ్వరయ్య, గుండాల ప్రేమ్‌కుమార్‌, మేనల్లుడు కొమ్ము రంగనాయకులు కక్షతో సోమవారం రాత్రి ఇంటిలో నిద్రిస్తున్న మునెయ్యపై గొడ్డళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబసభ్యులు గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని వైద్యశాలకు తరలించగా పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం మృతి చెందాడు. మునెయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సిఐ సోమయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

➡️