పల్నాడులో ఉద్రిక్తత – పోలింగ్‌ కేంద్రం వద్ద టిడిపి-వైసిపి బాహాబాహి

ప్రజాశక్తి-నరసరావుపేట (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పల్నాడు రోడ్డులోని ఎస్‌.ఎస్‌.ఎన్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద సోమవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి నరసరావుపేటకు చెందిన భరత్‌ రెడ్డి పోలింగ్‌ కేంద్రం బయట ఉన్న టిడిపి వర్గీయులను మీకు ఇక్కడ ఏం పని అని ప్రశ్నించారు. ఆగ్రహం వ్యక్తం చేసిన టిడిపి ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు భరత్‌ రెడ్డిని దూషించి దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలింగ్‌ కేంద్రం ఎదురుగా ఉన్న వైసిపి పార్లమెంట్‌ కార్యాలయంలో ముందస్తు పథకం ప్రకారం … గుమిగూడి ఉన్న వైసిపి నాయకులు, కార్యకర్తలు కర్రలతో రాళ్లతో ఒక్కసారిగా టిడిపి శ్రేణులపైకి దూసుకువచ్చారు. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు సిఆర్పిఎఫ్‌ బలగాలు ఇరు వర్గాలను చెదరగొట్టాయి. ఈ విషయం తెలుసుకున్న టిడిపి ముఖ్య నాయకులు పోలింగ్‌ కేంద్రం వద్దకు వస్తున్న క్రమంలో వైసిపి శ్రేణులు వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. పోలింగ్‌ కేంద్రం వద్ద సరైన భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని పోలీసుల తీరుపై ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నాయకులు ఉన్న సత్తెనపల్లి ఉమ్మడి కూటమి టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ కారును వైసిపి నాయకులు ధ్వంసం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసిపి శ్రేణులకు అండగా ఉంటూ టిడిపి నాయకులు కార్యకర్తలపై దాడిని ప్రోత్సహిస్తున్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.

➡️