విద్యార్థుల ఇళ్లకు టీచర్లు

May 22,2024 08:57 #homes, #students, #Teachers
  • గృహ సందర్శన పేరుతో రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమం
  • సంవత్సరానికి రెండు సార్లు తప్పనిసరి : ప్రవీణ్‌ ప్రకాష్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య బంధాలను బలోపేతం చేసే దిశగా ఈ విద్యాసంవత్సరం నుండే ‘గృహ సందర్శన’ కార్యక్రమాన్ని అమలు పరచబోతున్నామని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ వెల్లడించారు యూకే, ఆస్ట్రేలియా దేశాల్లోని ప్రభుత్వ పాఠశాలలో విజయవం తమైన కార్యక్రమాల నుంచి స్ఫూర్తిపొంది ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ‘ ఫ్రమ్‌ ది డెస్క్‌ ఆఫ్‌ ది ప్రిన్సిపల్‌ సెక్రటరీ, 16వ ఎపిసోడ్‌ ‘ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మట్లాడుతూ విద్యార్థుల్లో ఉత్తీర్ణతతోపాటు, ఉన్నత మార్కులు సాధించేందుకు వీలుగా గృహ సందర్శన కార్యక్రమం దోహదం చేస్తుందని చెప్పారు, ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి తరగతి ఉపాధ్యాయుడు సంవత్సరానికి రెండుసార్లు తమ విద్యార్థుల ఇళ్లను సందర్శిస్తారని, విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయులు వ్యక్తిగత వార్షిక విద్యా ప్రణాళికలు రూపొందిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులతో తల్లిదండ్రులకు నమ్మకమైన సంబంధం ఏర్పడి.. వారి పిల్లలు విద్యలో పాలుపంచుకునేలా ప్రోత్స హిస్తుందని, అలాగే విద్యార్థుల హాజరు, ప్రవర్తన, అభ్యాసంలో మెరుగుదలకు దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా 10 తరగతి, ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్షల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యార్థులు సాధించిన మార్కుల మధ్య ఉన్న వ్యత్యాసంపై ఆయన చర్చించారు. 10 తరగతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 600ల మార్కులకు సగటున 358 మార్కులు సాధిస్తే, ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థులు 479 మార్కులు సాధించారని చెప్పారు.

➡️