తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు – కాంగ్రెస్‌..బిఆర్‌ఎస్‌ ల మధ్య మాటలతూటాలు..!

తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈరోజు అసెంబ్లీలో ఇరిగేషన్‌ శాఖపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. తెలంగాణ శాసన సభలో బడ్జెట్‌ పై చర్చ ప్రారంభమైంది. బడ్జెట్‌ పై బిఆర్‌ఎస్‌ నుంచి చర్చను ప్రారంభించారు. మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌ బాబు ప్రసంగించారు. రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. బడ్జెట్‌ పై చర్చ జరుగుతుంటే ఆర్థిక మంత్రి, సిఎం రేవంత్‌ లేరు అని ఆరోపించారు. బడ్జెట్‌ పై చర్చలో ఒక్క అధికారి తప్ప ఎవ్వరూ లేరు అని అసహనాన్ని వ్యక్తం చేశారు.

అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ … తాను బుక్‌ లో ఉన్నది మాత్రమే చర్చ చేస్తున్నానన్నారు. మంత్రులకు ఏమైనా డౌట్‌ ఉంటే బడ్జెట్‌ పుస్తకం చదువుకోవాలని సూచించారు. బడ్జెట్‌ పుస్తకం తయారు చేసేటప్పుడు సరిచేసుకోవాలన్నారు. అందరి కోసం కాదు… కొందరి కోసం చేస్తుందే కాంగ్రెస్‌ పార్టీ అని అభివర్ణించారు. ఒకవైపు లెక్కల్లో గత ప్రభుత్వాన్ని పొగుడుతూ… మరో వైపు బయట తిడుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం పాలన సరిగ్గా లేకపోతే తలసారి ఆదాయం ఎలా పెరుగుతుంది ? అని ప్రశ్నించారు. అభివఅద్ధి జరగకపోతే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెటే రూ.2లక్షల 75వేలు ఎలా పెడతారు ? అని అడిగారు.

బడ్జెట్‌ పై చర్చలో కడియం శ్రీహరి, మంత్రులు పొన్నం, శ్రీధర్‌ బాబుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ మాత్రమేనని.. కడియం శ్రీహరి అనగానే మంత్రి పొన్నం ప్రభాకర్‌ అడ్డుకొని.. దేశం ఏర్పడిన రోజు సూది తయారు చేసుకునే పరిస్థితి లేదని అన్నారు. కడియం బడ్జెట్‌ పై మాత్రమే మాట్లాడాలని, పదేళ్లలో గత ప్రభుత్వం ఏమైనా చేసిందా ? అని పొన్నం ప్రశ్నించారు.

శాసన సభలో ఆరు గ్యారెంటీల అమలుపై రసాభాస చోటుచేసుకుంది. వనరులు చూసుకోకుండా, లెక్కలు వేయకుండా హామీలు ఇచ్చారా ? అని కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల హామీలను ప్రజలు నమ్మారనీ… తీరా గెలిచిన తరువాత ప్రజల నెత్తిమీద భస్మాసుర హస్తం పెడుతున్నారు అని ధ్వజమెత్తారు. దీనిపై మంత్రి శ్రీధర్‌ బాబు స్పందిస్తూ … ప్రభుత్వం ఏర్పడి 60 రోజులే అవుతుందని.. తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. ఆరు గ్యారెంటీల అంశం పై కడియం శ్రీహరి వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఆరు గ్యారెంటీలు, 13 హామీలు అమలు కావాలంటే రూ.1లక్ష 36వేల కోట్లు కావాలని చెప్పారు. ఆరు గ్యారెంటీలతో పాటు డిక్లరేషనలు, 420 హామీలు కాంగ్రెస్‌ ఇచ్చిందని తెలిపారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం రూ.53వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించారని అన్నారు.

అనంతరం ఇరిగేషన్‌పై తెలంగాణ శాసనసభలో వాగ్వాదం జరిగింది. లోయర్‌ మానేరు ఎల్లంపల్లి శ్రీరాంసాగర్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలువలు తవ్విందని, గత కాంగ్రెస్‌ ప్రభుత్వం లోనే 80 శాతం పూర్తయిన గౌరవెల్లి ఇప్పటికీ నీలి ఇవ్వలేకపోతోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. పదేళ్లు తమ యువరాజు సిరిసిల్లకు అన్యాయం చేశారని, కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న ఇప్పటికీ పూర్తి చేయలేదని ఆరోపించారు. కడియం శ్రీహరి వ్యాఖ్యలను తప్పుబడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఖండించారు.

అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, కెటిఆర్‌, పాడి కౌశిక్‌ రెడ్డిల మధ్య మాటల తూటలు పేలాయి. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతుండగా కూర్చో కూర్చో అంటూ కెటిఆర్‌ రన్నింగ్‌ కామెంట్స్‌ చేశారు. మాట్లాడేది వినబుద్ధి కాకపోతే సభలో నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ కెటిఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచించారు. పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యలకు హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి రన్నింగ్‌ కామెంట్స్‌ ఇచ్చారు. భార్య పిల్లలను అడ్డం పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్‌ మెయిల్‌ చేసి ఎమ్మెల్యే అయిన వాళ్లు కూడా సభలో మాట్లాడుతున్నారు అని విమర్శించారు. కౌశిక్‌ రెడ్డి, కెటిఆర్‌ తనను భయపెడితే భయపడను అని, భయపెడితే భయపడడానికి తాను బానిసను కాదు అని మంత్రి పొన్నం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ మేడిగడ్డ టూర్‌పై సభలో బిఆర్‌ఎస్‌ స్పందించింది. మేడిగడ్డపై ప్రభుత్వం పూర్తి విచారణ చేయాలని కడియం శ్రీహరి డిమాండ్‌ చేశారు. విచారణలో ఎవరు దోషులని తెలితే వాళ్లకు శిక్ష పడుతుందన్నారు. మేడిగడ్డ బ్యారేజీని వెంటనే రిపేరు చేయాలని కోరారు. మేడిగడ్డను రాజకీయం కోసమే కాకుండా ప్రజల కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. జూలై నెల వరకు మేడిగడ్డపై కాపర్‌ డ్యాం నిర్మించి ప్రజలకు నీళ్లు అందించేలాగా చర్యలు చేపట్టాలని కోరారు.

కడియం వ్యాఖ్యలను ఐటి మంత్రి శ్రీధర్‌ బాబు ఖండించారు. ఐటీలో లక్షల ఉద్యోగాలను సఅష్టించినందుకు కెటిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఐటీని తారా స్థాయికి కెటిఆర్‌ తీసుకెళ్లారని అన్నారు. గత ప్రభుత్వం చేసుకున్న ఎంవోయూలను మళ్లీ ఎంవోయూలు చేసుకున్నారు అని చెప్పారు. ఎంవోయూలపై కడియం వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్‌ బాబు ఖండించారు. గత ప్రభుత్వంలో చేసుకున్న ఎంవోయూలు ఒక్కటి కూడా మొన్నటి ఒప్పందాల్లో లేవు అని చెప్పారు. టీసీఎస్‌ లాంటి ఒప్పందాలు గత ప్రభుత్వంలో లేవు అని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బిఆర్‌ఎస్‌ బురదజల్లుతుందని మండిపడ్డారు.

➡️