178 మండలాల్లో వడగాడ్పులు

Apr 20,2024 08:57 #AP, #temparature
  • సాలూరులో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా నిప్పుల కొలిమిని తలపించే రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం మొత్తం 61 మండలాల్లో అతి తీవ్రంగా వడగాడ్పులు వీయగా, మరో 117 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా సింహాద్రిపురంలో 45.6, నంద్యాల జిల్లా బనగానపల్లె, ప్రకాశం జిల్లా మేకలవారిపల్లిలో 45.5 డిగ్రీల చొప్పున, విజయనగరం జిల్లా రామభద్రపురంలో 44.9 డిగ్రీలు, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 44.5, చిత్తూరు జిల్లా పీపల్లిలో 44.4, నెల్లూరు జిల్లా తేగచెర్ల, శ్రీకాకుళం జిల్లా కోవిలంలో 44.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రేపు, ఎల్లుండి కొనసాగుతున్న ఎండల ఉధృతి
రాష్ట్రంలో శని, ఆదివారాల్లోనూ ఎండల ఉధృతి కొనసాగే అవకాశాలు వున్నాయని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం 55 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 197 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం వుందని పేర్కొన్నారు. ఆదివారం 44 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 165 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం వుందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు.

➡️