మెగా డిఎస్‌సి విడుదల చేయాలి

Jan 3,2024 21:26 #dsc, #DYFI

– మంత్రి బొత్స క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన డివైఎఫ్‌ఐ

-అరెస్టు చేసిన పోలీసులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:మెగా డిఎస్‌సి ప్రకటించాలని కోరుతూ ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తక్షణమే డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలంటూ విద్యాశాఖ మంత్రి బత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయాన్ని డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విజయవాడలో ముట్టడించేందుకు బుధవారం వారు ప్రయత్నించారు. డివైఎఫ్‌ఐ నాయకులు, నిరుద్యోగులు ముందుగా బీసెంట్‌ రోడ్డుకు చేరుకుని అక్కడి నుంచి క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రదర్శనగా బయలుదేరారు. కార్యాలయం వద్దనున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారి పట్ల దురుసుగా ప్రవర్తించడంతో అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగులను, డివైఎఫ్‌ఐ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి వ్యాన్‌లో పడేశారు. ముందుగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై రాము, జి రామన్నను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో డివైఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు రమణ, శివ, నగేష్‌బాబు, కృష్ణ, నాగేశ్వరరావు, కిరణ్‌, హరీష్‌, ఆంజనేయరాజు, సంతోష్‌, వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. అరెస్టులు అనంతరం మరికొంత మంది నిరుద్యోగులు అక్కడికి చేరుకోగా, వారినీ అరెస్టు చేసి మాచవరం, మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. 25 వేల పోస్టులతో నోటిఫికేషన్‌ : రామన్న డిమాండ్‌రాష్ట్ర ప్రభుత్వం 25 వేల టీచర్‌ పోస్టులతో మెగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డివైఎఫ్‌ఐ కార్యదర్శి రామన్న డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 40 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. మెగా డిఎస్‌సి విడుదల చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చి నాలుగేళ్లుగా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. ఖాళీ పోస్టులపై మంత్రి బత్స సత్యనారాయణ రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చాక 117 జిఓ పేరుతో 2 వేల పాఠశాలలను మూసివేసిందని తెలిపారు. తెలుగు మీడియం రద్దు చేసి మరో 15 వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసిందన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో 9 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్‌ కోసం 10 లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని అన్నారు. వెంటనే నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయాలని, లేదంటే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటారని హెచ్చరించారు. అరెస్టులను ఖండించిన సిపిఎండివైఎఫ్‌ఐ, ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థుల అరెస్టును సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది. డిఎస్‌సి నోటిఫికేషన్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ మంత్రి బత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన డివైఎఫ్‌ నాయకులు, అభ్యర్థులపై పోలీసులు దురుసుగా వ్యవహరించి అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెగా డిఎస్‌సి ప్రకటిస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను ఇప్పటికైనా వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. గడిచిన ఐదేళ్లలో 5 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్‌సి కోసం రూ.లక్షలు వెచ్చించి శిక్షణ తీసుకుని ఎదురు చూస్తున్నారని తెలిపారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం డిఎస్‌సి ప్రకటించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయని వివరించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులను అరెస్టులు చేయడం అక్రమం అని అన్నారు.

➡️