ఆ మేనిఫెస్టో అబద్దాల పుట్ట

  • వ్యవసాయం దండగన్నది చంద్రబాబు కాదా?
  • మైదుకూరు, కలికిరి, టంగుటూరు సభల్లో వైసిపి అధినేత జగన్‌

ప్రజాశక్తి – కడప ప్రతినిధి, ఒంగోలు బ్యూరో : గత టిడిపి మేనిఫెస్టోలోని హామీల అమలుపై ప్రశ్నిస్తే సమాధానం లేదని, సూపర్‌సిక్స్‌కు ఎటువంటి విశ్వసనీయతా లేదని, తాజా మేనిఫెస్టోలో బిజెపి ఫొటో పెట్టొద్దనే ఆదేశాలతో మోసపూరిత మేనిఫెస్టోగా రుజువైందని వైసిపి అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు, అన్నమయ్య జిల్లా కలికిరి, ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం టంగుటూరులో నిర్వహించిన సభల్లో జగన్‌ మాట్లాడారు. 2014 ఎన్నికల ముంగిట టిడిపి, జనసేన, బిజెపి నేతల ఫొటోలతో కూడిన మేనిఫెస్టోను ఇంటింటికీ పంపించి ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ మేనిఫెస్టోను బుట్టదాఖలు చేశారన్నారు. ఆ మేనిఫెస్టోలోని మొదటి హామీలో రూ.86,799 కోట్ల రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానని హామీ ఇచ్చారని, ఎంతమందికి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేశారు?, ఆడబిడ్డ పుట్టగానే మహాలకీë పథకం కింద రూ.20 వేలు ఎందుకు ఖాతాలో జమ చేయలేదు? అని ప్రశ్నించారు. రూ.పది వేల కోట్లతో బిసి సబ్‌ప్లాన్‌, ప్రతి పట్టణాన్ని హైటెక్‌ సిటీగా, సింగపూర్‌గా చేస్తానని హామీ ఇచ్చారని, చివరికి రాష్ట్రానికి ప్రత్యేక హోదానైనా తెచ్చారా అంటే దాన్నీ అమ్మేశారని ఎద్దేవా చేశారు. ‘వ్యవసాయం దండగన్నది చంద్రబాబు కాదా.. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలి అని చెప్పిన మాటలు చంద్రబాబువి కాదా? అని అడుగుతున్నా..’ అని అన్నారు. అభివృద్ధి విషయంలోనూ చంద్రబాబుది బోగస్‌ రిపోర్టు అని.. తమది ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ అని చెప్పారు. ఎవరు వంచన చేశారో.. ఎవరు న్యాయం చేశారో చూద్దామా?అని సవాలు విసిరారు. తమ ప్రభుత్వంలో పింఛను కానుక, నాడు-నేడు, విద్యా కానుక, ఇంగ్లీష్‌ మీడియం, బైజూన్‌ కంటెంట్‌, డిజిటల్‌ బోర్డులు, బోధన, సిబిఎస్‌ఇ, ఐబి వరకు ప్రయాణించామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు, కొత్తగా నాలుగు షిప్పింగు హార్బర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తమ సంక్షేమ పథకాలను చదివితే చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు, చంద్రన్న కాంగ్రెస్‌కు కోపం వస్తోందని విమర్శించారు. కరోనా, సంక్షేమ పథకాల ఆర్థిక పరిస్థితుల కారణంగా రాజోలి రిజర్వాయర్‌ నిర్మాణ పనులు నిర్మించలేకపోయానని, వచ్చే టర్మ్‌లో పూర్తి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో కడప ఎంపి అభ్యర్థి అవినాష్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్‌.రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌, ఒంగోలు ఎంపి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కొండపి అభ్యర్థి ఆదిమూలపు సురేష్‌, ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, వేమూరు అభ్యర్థి వరికూటి అశోక్‌బాబు, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

➡️