కూటమిదే పీఠం

May 11,2024 21:35 #janasena pawan, #speech

కాకినాడ ఎన్నికల ప్రచార సభలో పవన్‌ కల్యాణ్‌
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి :ఎన్నికల ప్రచారం ముగిసింది, ఇక కూటమిదే విజయం, ధర్మానిదే గెలుపు అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు చివరి సభ కాకినాడ సిటీ నియోజకవర్గంóలో నిర్వహించారు. బాలాజీ చెరువు సెంటర్లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అక్రమాస్తుల కేసులో ఉన్న జగన్‌ దేశం దాటి వెళ్లడానికి కోర్టు అనుమతి తీసుకోవాలన్నారు. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వడం మన దురదృష్టమని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అక్రమ బియ్యం వ్యాపారం, గంజాయి అమ్మకం చేస్తున్నాడని, పేకాట క్లబ్‌లను నిర్వహిస్తున్నాడని, మడ అడవులను విధ్వంసం చేశాడని ఆరోపించారు. డ్రగ్స్‌ మాఫియాను పెంచి పోషిస్తున్నాడని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇటువంటి అక్రమార్కుల పాలన మారాలంటే టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. మార్పు కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం కూటమికి ఓటు వేయాలన్నారు.
ఎన్నో అవమానాలకు గురిచేసినా, తిట్టినా భరించి రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నానని పేర్కొన్నారు. వైసిపికి ఓటు వేసి చేజేతులారా గూండా ప్రభుత్వాన్ని తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కాకినాడ ఎంపి అభ్యర్థి సునీల్‌ ఎన్నికలు జరిగినప్పుడల్లా పార్టీలు మారతారని విమర్శించారు. పార్టీలు మారే వ్యక్తులు కాకుండా స్థిరంగా ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలని కోరారు. ఆడపిల్లలు అదృశ్యమైతే జగన్‌ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కాకినాడను గంజాయికి రాజధానిగా మార్చేశారన్నారు. ఇసుక దోపిడీతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి ఎన్నికల్లో ఎలాగైనా గెలవడం కోసం పెద్ద ఎత్తున ఓట్లను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. యూనియన్‌ నాయకులను బెదిరిస్తున్నారన్నారు. ఇలాంటి నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. విద్య, వైద్యం, ఉపాధి, సాగు, తాగునీరు సవ్యంగా అందాలంటే కూటమి రావాలన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అమలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రకటించిన మేనిఫెస్టో పథకాలను ఆయన వివరించారు. కాకినాడ సిటీ, రూరల్‌, పార్లమెంటు కూటమి అభ్యర్థులు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, ఉదరు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️