ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టిన కార్మికుల కళారూపం

Jan 2,2024 15:16 #Dharna, #muncipal workers

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : మున్సిపల్‌ పారిశుధ్య ఇంజనీరింగ్‌ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట కార్మికులు ప్రదర్శించిన కళారూపకం ప్రజలను ఆలోచింపజేసింది. కార్మికుల పట్ల పనిభారం పెంచుతున్న ప్రభుత్వం కార్మికులకు ప్రజలకు కల్పించాల్సిన మౌలిక వసతుల పట్ల చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని వారు ప్రదర్శించారు. కార్మికులు సీఎం జగన్‌ మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జిల్లా మాస్కులు ధరించి వారు అనుసరించే విధివిధానాల పట్ల కార్మికులు ప్రజలు ఎంత ఇబ్బందుల పడుతున్న వైనాన్ని కళ్ళకు కట్టేలా ప్రదర్శించారు. మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య మరియు ఇంజనీరింగ్‌ విభాగాలలో పనిచేస్తున్న కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒకవైపు కార్మికులను మాత్రమే గుర్తించి మరొకవైపు కార్మికులను నిర్లక్ష్యం చేయడం సబబు కాదని అందువలన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంజనీరింగ్‌ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను,ప్రమాదాలను నాటిక రూపంలో ప్రదర్శించి చూపించడం జరిగిందన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే మున్సిపల్‌ కార్మికులకు హామీలు ఇచ్చిందో అవన్నీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అరకోర హామీలు ఇచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కార్మికులు సమ్మె యధావిధిగా కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్ర కుమార్‌, నగర కార్యదర్శి వెంకటనారాయణ, కార్మిక సంఘం మున్సిపల్‌ కార్పొరేషన్‌ నగర అధ్యక్షుడు కార్యదర్శులు తిరుమల, ఎర్రిస్వామి, మల్లికార్జున, సంజీవ రాయుడు, ఓబుల్‌ పతి వరలక్ష్మి, లక్ష్మి నరసమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️