పోలవరం ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారు?

  •  కేంద్రంతో పోరాడాల్సింది పోయి ప్రజల మీద సెస్‌ విధిస్తారా..
  •  రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ : ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని మాజీ మంత్రి, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. కేంద్రంతో పోరాడి డబ్బులు తేవాల్సింది పోయి ప్రజల మీద సెస్‌ విధించి పోలవరం పూర్తి చేస్తామని పవన్‌ కల్యాణ్‌ చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. ఏలూరులోని స్ఫూర్తి భవన్‌లో ఇండియా వేదిక అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సిపిఐ జిల్లా కార్యదర్శి మనవ కృష్ణ చైతన్య అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నా, రాష్ట్రానికి మేలు జరగాలన్నా కేంద్రంలో బిజెపిని, రాష్ట్రంలో దానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిస్తున్న టిడిపి, జనసేన, వైసిపిలను ఓడించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ సర్కారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా ఆదాని, అంబానీ వంటి కార్పొరేట్లకు కట్టబెడుతోందని వివరించారు. రాష్ట్రంలో చంద్రబాబు వికసిత ఆంధ్రప్రదేశ్‌ రావాలంటే ఎన్‌డిఎ కూటమిని గెలిపించాలని చెబుతున్నారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇస్తామని మోడీతో ప్రకటన చేయించగలరా? అని ఆయన ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తామని, అమ్మలేకపోతే మూసేస్తామని కేంద్ర మంత్రులు బహిరంగంగా ప్రకటన చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో చంద్రబాబుగానీ, జగన్‌గానీ ఎందుకు మాట్లాడటంలేదని నిలదీశారు. కేంద్రమే పూర్తి చేయాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తన నెత్తిన వేసుకుని.. పునరావాసం, భూసేకరణ ఖర్చు రాష్ట్రమే భరించాలని కేంద్రం చెప్పే స్థితికి తీసుకువచ్చారని అన్నారు. పోలవరం పూర్తి చేస్తామని కాంగ్రెస్‌ ఇప్పటికే ప్రకటించిందని, ప్రత్యేక హోదాపై రెండవ సంతకం చేస్తామని రాహుల్‌ గాంధీ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి కెఎల్‌.రావు కుమారుడు కె.విజయరావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నోట్ల రద్దు, జిఎస్‌టి నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోయిందని, 45 శాతం సూక్ష్మ పరిశ్రమలు మూతపడ్డాయని, లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని తెలిపారు. రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి బండ్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను మోడీ వద్ద తాకట్టుపెట్టిన పొత్తు, తొత్తు పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఐ ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.ఝాన్సీ, భారత్‌ బచావో నాయకులు గుబ్బల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్‌రావు, సిపిఎం నగర కార్యదర్శి పి కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️