గృహ జ్యోతి, గ్యాస్‌ సిలిండర్‌ పథకాల అమలుకు మహూర్తం ఖరారు

హైదరాబాద్‌: ఆరు గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్‌ ప్రకటించిన గృహ జ్యోతి, గ్యాస్‌ సిలిండర్‌ పథకాల అమలుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఈనెల 27 లేదా 29న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలపై కేబినెట్‌ సబ్‌ కమిటీతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సబ్సిడీ ఎలా అందించాలనే అంశంపై చర్చించారు. గ్యాస్‌ ఏజెన్సీలతో చర్చలు జరపాలని సీఎం సూచించారు. గృహ జ్యోతి పథకం కింద జీరో బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు.

”ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వాలి. లబ్ధిదారుడు రూ.500 చెల్లిస్తే సిలిండర్‌ ఇచ్చేవిధంగా అనువైన విధానాన్ని అనుసరించాలి. సబ్సిడీని ఖాతాకు బదిలీ చేయాలా? ఏజెన్సీలకు చెల్లించాలా? అనుమానాలు, అపోహలకు తావు లేకుండా గృహజ్యోతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలి. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలి. తెల్ల రేషన్‌ కార్డు ఉండి, 200 యూనిట్లలోపు గృహ విద్యుత్తు వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలి. ప్రజాపాలన దరఖాస్తుల్లో రేషన్‌ కార్డు నంబరు, విద్యుత్‌ కనెక్షన్‌ నంబరు తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయినవారు ఉంటే.. సవరించుకునే అవకాశమివ్వాలి. అలాగే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని వారుంటే ఎంపీడీవో, తహశీల్దార్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలి” అని సీఎం ఆదేశించారు.

➡️