16న వైసిపి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల

Mar 13,2024 18:03 #2024 elections, #candidates, #YCP
  • ఇడుపులపాయలో ప్రకటించనున్న సిఎం జగన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి రోజుకో పేరుతో నెలకొన్న గందరగోళానికి వైసిపి అధిష్టానం తెరదించనుంది. ఇప్పటికే పలుదఫాలుగా అభ్యర్థులను మారుస్తూ వచ్చిన ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 16వ తేది తుది జాబితా ప్రకటించనున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన అన్ని జాబితాలను కలిపి మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల అభ్యర్థుల వివరాలను ఇడుపాలపాయ వేదికగా ఆయన వెల్లడించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారైంది. తుది జాబితా ప్రకటన తరువాత 18వ తేదిన శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నియోజకవర్గం నుండి ఆయన ప్రచార పర్వాన్ని ప్రారంభించానున్నారు. . జగన్‌ ప్రచారం కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్‌లను తీసుకున్నారు. ప్రతి రోజు రెండు మూడు ప్రాంతాల్లో బహిరంగ సభలను నిర్వహించేలా ప్రణాళికలను తయారు చేసినట్లు తెలిసింది. మొదటి రోజున శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి మొదలు పెట్టి ఆదే రోజున విజయవాడ వెస్ట్‌, నెల్లూరు రూరల్‌లో జరిగే బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొనేలా కార్యక్రమాలను రూపొందించారు. బహిరంగ సభలతో పాటు కీలకమైన నగరాల్లో రోడ్‌ షోలలో పాల్గొనేలా పార్టీ వర్గాలు షెడ్యూల్‌ను రూపకల్పన చేస్తున్నారు.
కీలక నియోజకవర్గాలపై ఫోకస్‌- తాడేపల్లిలో అసంతృప్తవాదులతో చర్చలు
రాష్ట్రంలో తలనొప్పిగా మారిన నియోజకవర్గాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దృష్టి సారించింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె రోజా, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబులు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలు నగరి, సత్తెనపల్లిలో మళ్లీ వారికే టికెట్‌ ఇస్తే ఓడించి తీరుతామని ఆయా నియోజకవర్గాల్లోని కీలకనేతలు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. నర్సారావుపేట నుండి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మరో అవకాశం ఇవ్వవద్దని తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేశారు. ఆయా నియోజకవర్గాల్లోని అసంతృప్తవాదులను పార్టీ నాయకత్వం సముదాయిస్తోంది. చర్చలు కొలిక్కిరాకపోతే ఆ స్థానాల్లో కూడా అభ్యర్థులను మార్చే అవకాశం వుందని వైసిపి వర్గాలు చెబుతున్నాయి.

➡️