కోవిడ్‌ లక్షణాలతో విశాఖలో మహిళ మృతి

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విశాఖలో ఓ మహిళ కోవిడ్‌ పాజిటివ్‌తో మృతి చెందిందన్న వార్త ప్రజలను కలవరపరిచింది. విశాఖ నగరంలోని కంచరపాలేనికి చెందిన మహిళ (51) ఈ నెల 22న అక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌తో పాటు తీవ్రమైన కిడ్నీ ఫెయిల్యూర్‌ సమస్యతో, మల్టీ ఆర్గాన్‌ డిస్ఫంక్షన్‌ సిండ్రోమ్‌తో బాధపడుతూ ఛాతీ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు పరీక్షలు చేయగా ఆర్‌టిపిసిఆర్‌లో కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. అనంతరం ఆమెను డయాలిసిస్‌ కోసం కెజిహెచ్‌కు ఈ నెల 24న తరలించారు. మంగళవారం ఉదయం ఆమె మృతి చెందారు. కోవిడ్‌తోనే ఆమె మరణించినట్టు ప్రచారం జరిగింది.

కోవిడ్‌ మరణమని భావించరాదు : కెజిహెచ్‌

ఆమెది కోవిడ్‌ మరణమని భావించరాదని కెజిహెచ్‌ సూపరింటెండెంట్‌ పి.అశోక్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆమె ఆస్పత్రిలో చేరాక ఉత్తమ చికిత్స అందించామని తెలిపారు. ఆమె మరణానికి ముందే చాలా వ్యాధులతో బాధపడుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాటి వల్ల సంభవించిన మరణమే తప్ప, కేవలం కోవిడ్‌ వల్ల మాత్రమేనని భావించరాదని నిపుణులు అభిప్రాయపడుతున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. మృతురాలి కోవిడ్‌ పరీక్షా ఫలితాలను జినోమ్‌ నిర్ధారణకు విజయవాడ సెంట్రల్‌ లేబొరేటరీకి పంపించామని, వాటి ఫలితాల కోసం వేచి చూస్తున్నామని పేర్కొన్నారు. కోవిడ్‌ కేసుల పట్ల అందోళన చెందాల్సిన పనిలేదని, ప్రజలంతా తగు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని అన్నారు. ఉమ్మడి విజయనగరంలో కరోనా కేసులు పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లాల్లో తొలి కరోనా కేసులు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం కుందరతిరువాడకు చెందిన ఓ మహిళ భర్త ఇటీవల శబరిమలకు వెళ్లి వచ్చారు. తమ బంధువులకు ప్రసాదాలు పంచే క్రమంలో బైక్‌ యాక్సిడెంట్‌లో ఆమె గాయపడ్డారు. వైద్యం కోసం విశాఖకు వెళ్లగా..అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో విజయనగరంలో ఓ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యుల సూచన మేరకు విశాఖ కెజిహెచ్‌కు వెళ్లారు. అక్కడ పరీక్షలు చేయగా కరోనా సోకినట్లుగా నిర్ధారించామని డిఎంహెచ్‌ఒ ఎస్‌.భాస్కరరావు తెలిపారు.

➡️