ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పాపం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది

May 2,2024 18:41 #2004 Elections, #Ch Baburao, #cpm
  •  ఈ చట్టంపై నిజాయితీగా పోరాడేది ఇండియా వేదిక, కమ్యూనిస్టులే
  •  మధురానగర్‌ ప్రచారంలో సిపిఎం అభ్యర్థి బాబురావు, ఇండియా బ్లాక్‌ వేదిక నేతలు

ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ సెంట్రల్‌ ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థి సిహెచ్‌ బాబురావు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ నేతలతో కలిసి 29వ డివిజన్‌,మధురా నగర్‌, సాయిబాబా కాలనీ, నేతాజీ కాలనీ, కాలవకట్ట, కొబ్బరి తోట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రాకపోకలకు అవకాశం కల్పించినా, ఇంకా అసంపూర్తిగా మిగిలిపోయిన అండర్‌ బ్రిడ్జి పనులను బాబురావు పరిశీలించారు. అనంతరం బాబురావు, ఇతర నేతలు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం సామాన్యుల భూములను రక్షించేదిగా కాకుండా భక్షించేదిగా ఉందన్నారు. ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని.. ఈ పాపం బిజెపి, వైసిపిలదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌ ద్వారా ఇటువంటి చట్టం తేవాలని ఆదేశించిందని.. జగన్‌ ప్రభుత్వం కేంద్రం ఆదేశాలకు లొంగిపోయి హడావుడిగా ఈ చట్టం తెచ్చి సామాన్యుల హక్కులను హరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల భూములపై ప్రభుత్వం పెత్తనం చేసే అవకాశం కల్పిస్తుందన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, బిజెపి, వైసిపిలు కపట నాటకం ఆడుతున్నాయని..ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటున్నాయని.. ఈ పాపంలో ఇద్దరిదీ బాధ్యత ఉందన్నారు. ల్యాండ్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్తున్న తెలుగుదేశంలో చిత్తశుద్ధి కొరవడిందన్నారు. టిడిపికి చిత్తశుద్ధి ఉంటే మోడీ ద్వారా నీతి ఆయోగ్‌ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలన్నారు. వైసిపి ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ప్రజలను మభ్యపరచడానికి వైసిపి, బిజెపి-టిడిపి కూటమి ప్రయత్నిస్తున్నాయన్నారు. ఈ చట్టంపై నికరంగా పోరాడేది కమ్యూనిస్టులు, ఇండియా వేదిక పార్టీలు మాత్రమేనని తెలిపారు. ఈ చట్టాన్ని ఎదుర్కోవాలంటే అసెంట్లకి కమ్యూనిస్టులను పంపాలి. ఇండియా వేదికను బలపరచాలని కోరారు. మధురానగర్‌ అండర్‌ బ్రిడ్జి ఆరేళ్ల అనంతరం రాకపోకలు ప్రారంభం అవకాశం కల్పించారని.. వైసిపి, టిడిపి ప్రభుత్వాలు ప్రజలకు నరకం చూపించాయని.. ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. సంవత్సరాలు పాటు పనులు నిలిపివేసి ఎన్నికలకు ముందు హడావిడిగా రాకపోకలు ప్రారంభించి తమ గొప్పతనంగా ఈ పార్టీలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇంకా అనేక పనులు సాగుతూనే ఉన్నాయి. రాకపోకలు ప్రారంభించిన తర్వాత కూడా పనులు జరగటం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. భారీ వాహనాలకు ఇంకా అవకాశం కల్పించలేదని.. తప్పుడు డిజైన్ల వల్ల పూర్తిస్థాయిలో పెద్ద వాహనాలకు రాకపోకలకు అవకాశం కనబడటం లేదన్నారు. మధురానగర్‌ పప్పుల మిల్లు వద్ద మరొక బ్రిడ్జి నిర్మాణం జరగాలన్నారు. ఈ పనులన్నీ జరగాలంటే కమ్యూనిస్టులు గెలవాలని.. బాబురావు ఎన్నిక కావాలన్నారు. నేడు జరిగిన ఈ పర్యటనలో సిపిఎం, ఇండియా వేదిక నేతలు ఎన్‌ శ్రీనివాస్‌, పి.కృష్ణమూర్తి, వై.కృష్ణ, చిన్నా , విజయ, శశి, రాము, మురళి, రామారావు, శివ, సుప్రజ, కళ్యాణ్‌, ఆశా, షకీలా తదితరులు పాల్గొన్నారు.

➡️