యాజమాన్యం నిరంకుశ వైఖరిని విడనాడాలి

  •  ఎపి పేపరుమిల్లు కార్మిక సంఘాల నాయకులు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : రాజమహేంద్రవరంలోని ఎపి పేపర్‌ మిల్‌ యాజమాన్యం మొండి వైఖరి విడనాడి వేతన ఒప్పందం వెంటనే చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఎపి పేపరు మిల్లు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్‌ మాట్లాడుతూ.. ఎపి పేపరు మిల్లులో ప్రతి రెండేళ్లకు కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని, మూడున్నరేళ్లకోసారి వేతన ఒప్పందం చేసుకోవాల్సి ఉందని తెలిపారు. 2020 జూన్‌తో వేతన ఒప్పందం ముగిసినా, నేటికీ నూతన వేతన ఒప్పందం చేయకపోవడం దారుణమన్నారు. కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలకు ఆటంకాలు సృష్టించిందని తెలిపారు. కోర్టులను సైతం తప్పుదారి పట్టించేలా కార్మికుల గుర్తింపు సంఘాలను రద్దు చేసేందుకు యత్నించిందని తెలిపారు. యాజమాన్యం అనుసరిస్తున్న దుర్మార్గపు విధానాలను కార్మిక సంఘాలు సంఘటితంగా ప్రతిఘటించాయని వివరించారు. వేతన ఒప్పందం చేసుకోవాలని కార్మిక శాఖ ఉన్నతాధికారులు సూచించినప్పటికీ యాజమాన్యం ఆ దిశగా చొరవ చూపలేదన్నారు. ఈ నెల 12న జరిగిన చర్చల్లోనూ మొండిగా వ్యవహరించిదని తెలిపారు. ఇప్పటికైనా యాజమాన్యం దిగిరావాలని, ఆ దిశగా ఉన్నతాధికారులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఐఎన్‌టియుసి అధ్యక్షులు జెవై దాసు మాట్లాడుతూ ఆందోళనల నేపథ్యంలో 40 సార్లు సమావేశాలు జరిగినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదన్నారు. ఎఐటియుసి కార్యదర్శి కష్ణ మాట్లాడుతూ కార్మికులకు అధిక మొత్తంలో వేతనాలు చెల్లిస్తున్నట్లు యాజమాన్యం చేసిన వాఖ్యలను ఖండించారు. కాంట్రాక్టు కార్మికులకు రూ.9 వేలు, సీనియర్‌ పర్మినెంట్‌ కార్మికులకు రూ.30 వేలు వేతనం మించి లేదన్నారు. ఎస్‌డబ్ల్యుడబ్ల్యుఎ నాయకులు కస్సే రాజేష్‌ మాట్లాడుతూ 17 రోజులుగా ఎండలోనే నిరసన తెలిపినా యాజమాన్యానికి చీమకుట్టినట్టయినా లేదన్నారు. యునైటెడ్‌ యూనియన్‌ నాయకులు సుబ్రహ్మణ్యనాయుడు మాట్లాడుతూ యాజమాన్యం సమస్యలను పరిష్కరించకపోగా రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు సత్తిరాజు, సమైక్య కార్మిక సంఘం నాయకులు బి.మురళి మాట్లాడుతూ మిల్లు అభివృద్ధిలో భాగస్వాములైన కార్మికులను యాజమాన్యం దొంగలుగా చూడటం బాధాకరమన్నారు. ఇలాంటి యాజమాన్యాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని తెలిపారు.

➡️