టికెట్‌ రీషెడ్యూల్‌ చేయలేదని విమానానికి బాంబు బెదిరింపు : వ్యక్తి అరెస్టు

తెలంగాణ : తన టికెట్‌ను రీషెడ్యూల్‌ చేయలేదన్న కోపంతో ఓ వ్యక్తి బాంబు బెదిరింపులకు పాల్పడిన ఘటన కేరళలో జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు మాట్లాడుతూ … సోమవారం అర్థరాత్రి ముంబయిలోని ఎయిర్‌ ఇండియా కస్టమర్‌ కేర్‌కు ఓ వ్యక్తి కాల్‌ చేసి కొచ్చి-లండన్‌ ఎయిర్‌ ఇండియా విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరించాడని తెలిపారు. సమాచారం అందుకున్న కొచ్చి విమానాశ్రయ అధికారులు విమానంలో సోదాలు చేశారనీ, తీవ్ర గాలింపుల అనంతరం అది తప్పుడు సమాచారం అని నిర్ధారించడంతో విమానం లండన్‌కు బయలుదేరిందని చెప్పారు. ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో కాల్‌ చేసిన వ్యక్తి లండన్‌కు టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికుడు షుహైబ్‌ (30) అని నిర్థారణ అయ్యింది. దీంతో సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షుహైబ్‌ మంగళవారం తన భార్య, కుమార్తెతో కలిసి ఎ1 149 విమానంలో లండన్‌కు వెళ్లాల్సిఉంది. అదే సమయంలో ఆయన కుమార్తె ఫుడ్‌ పాయిజనింగ్‌తో బాధ పడుతుండడంతో టికెట్‌ను మరో రోజు రీషెడ్యూల్‌ చేయాలని ఎయిర్‌లైన్స్‌ను కోరారు. ఎయిర్‌లైన్స్‌ అందుకు నిరాకరించడంతో నిరాశ చెందిన షుహైబ్‌ బాంబు బెదిరింపు చర్చలకు పాల్పడ్డారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

➡️