మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై ఐక్య పోరాటాలు

చిత్తూరు కార్పొరేషన్‌లో భారీగా సిఐటియులో చేరిక

ప్రజాశక్తి – చిత్తూరు అర్బన్‌ :మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై ఐక్య పోరాటాలను ఉధృతం చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులు భారీ సంఖ్యలో శుక్రవారం ఎఐటియుసి నుంచి సిఐటియు యూనియన్‌లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై సమరశీల పోరాటాలు చేస్తున్న ఏకైక కార్మిక సంఘం సిఐటియు అని అన్నారు. వారి సమస్యలపై పోరాటాలు చేసి జిఒలు సాధించిన చరిత్ర యూనియన్‌కు ఉందని వివరించారు. అలాంటి సిఐటియులో కార్మికులందరూ చేరడం అభినందనీయమన్నారు. కార్మికులపై పనిభారం పెరుగుతోందని తెలిపారు. కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని, సుప్రీంకోర్టు చెప్పినట్లు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పోరాటాలను ఉధృతం చేయడం ద్వారా ప్రభుత్వాలు దిగి వచ్చాయన్నారు. జిల్లా కార్పొరేషన్‌లోనూ ప్రభుత్వం ఇచ్చిన జిఒల ప్రకారం అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు సంక్రాంతి అలవెన్స్‌ వెయ్యి రూపాయలు వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ సమావేశానికి చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు విజరుకుమార్‌ అధ్యక్షత వహించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రన్‌, జిల్లా ఉపాధ్యక్షులు వాడ గంగరాజు, యూనియన్‌ నాయకులు నాగరాజు, సుబ్రమణ్యం, గోపీ పాల్గొన్నారు.

➡️