ప్రజాస్వామ్య పరిరక్షణే ఏకైక లక్ష్యం

May 1,2024 01:00 #2024 election
  •  రాష్ట్ర ప్రత్యేక పోలీసు అబ్జర్వర్‌ దీపక్‌ మిశ్రా

ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌ :ప్రజాస్వామ్య పరిరక్షణ మన ముందు ఉన్న ఏకైక లక్ష్యమని, ఎన్నికల నేపథ్యంలో విధి నిర్వహణ ఎంతో కీలకమని రాష్ట్ర ప్రత్యేక ఎన్నికల పోలీసు అబ్జర్వర్‌ దీపక్‌ మిశ్రా పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు పరిశీలకులు దీపక్‌ మిశ్రా జిల్లా పర్యటన సందర్భంగా ఏలూరు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అదనపు డిజిపి శంఖత్రప బాగ్బి, జిల్లా ఎన్నికల పోలీసు పరిశీలకులు టి.శ్రీధర్‌, ఏలూరు రేంజ్‌ ఐజి జివిజి అశోక్‌ కుమార్‌, జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్‌, ఎస్‌పి డి.మేరీ ప్రశాంతి, ఇతర అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దీపక్‌ మిశ్రా మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసులు కులం, మతం, ప్రాంతం, తదితర బేధం లేకుండా ప్రవర్తించాల్సి ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్లు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు వ్యవస్థ విధులు నిర్వర్తించాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారితో సమన్వయం చేసుకోవాలని దీపక్‌ మిశ్రా సూచించారు. ప్రతి ఐదు సంవత్సరాలకోసారి ఓటు హక్కు ద్వారా పాలకులను ఎన్నుకోవడం జరుగుతోందని తెలిపారు. ఆ క్రమంలో పోలీసులు, భద్రతా సిబ్బంది నిర్వహించే ఉద్యోగ నిర్వహణ సామర్థ్యంం కలిగి ఉండాలన్నారు. పొలింగ్‌ కేంద్రాల వద్ద ఎటువంటి సమస్యా తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల స్లిప్పుల పంపిణీ కోసం, హోమ్‌ ఓటింగ్‌పై తీసుకున్న చర్యల గురించి ఆయన ప్రస్తావించారు. ఇవిఎంల తరలింపు సమయంలో సంబంధిత వాహనాలకు ముందు బ్యాక్‌ కెమెరాతో వీడియో చిత్రీకరణ చేయాలని, మార్గమధ్యంలో ఎక్కడా వాహనాన్ని నిలుపుదల చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. ఓటర్‌ స్లిప్పుల పంపిణీ, పోస్టల్‌ బ్యాలెట్‌, హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియకు చెందిన సమాచారం అందజేసి, తగిన రశీదు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద వీడియో రికార్డింగ్‌, వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 24/7 పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే అవాస్తవ వార్తా కథనాలను, తదితరాలను నియంత్రించేందుకు ప్రత్యేక ఫోన్‌ నంబరు ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని తెలిపారు.

➡️