రాష్ట్రానికి పదేళ్లుగా అన్యాయం

  • మోడీతో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రమాదం
  • తొలి గ్యారంటీగా ప్రతి పేద కుటుంబానికి నెలకు ఐదు వేలు
  • ఆంధ్రా హక్కులు సాధించే వరకు వెనుతిరగను : వై.ఎస్‌ షర్మిల
  • బిజెపి గద్దె దిగక తప్పదు : శ్రీనివాసరావు, రామకృష్ణ

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : ‘పదేళ్లుగా రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోంది. కేంద్రం నుండి న్యాయంగా రావాల్సిన ఒక్క రూపాయి కూడా ఆంధ్రాకు రాలేదు. అయినా చంద్రబాబు, జగన్‌, పవన్‌ ప్రశ్నించడం లేదు. ముఖ్యమంత్రులుగా చంద్రబాబు, జగన్‌ రాష్ట్రాన్ని అన్ని విధాల దివాళా తీయించారు ‘అని ఎఐసిసి అధ్యక్షలు మల్లికార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో సోమవారం నాడు న్యాయ సాధన సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఖర్గేతోపాటు పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల పలువరు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే కన్నడ, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రసంగించగా, సిడబ్ల్యుసి సభ్యుడు ఎన్‌.రఘువీరారెడ్డి తెలుగులోకి అనువదించారు. ఖర్గే మాట్లాడుతూ రాష్ట్రానికి బిజెపి చేసిన అన్యాయాన్ని, దాన్ని ఏమాత్రం ప్రతిఘటించకుండా దాసోహమన్న తెలుగుదేశం, వైసిపి, జనసేనల తీరును తీవ్రంగా విమర్శించారు. ‘బిజెపి అంటే బాబు, జగన్‌, పవన్‌,’ అని అన్నారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయకున్నా మోడీకి వైసిపి, టిడిపి, జనసేనలు సాగిల పడుతున్నాయన్నారు. గడిచిన పదేళ్ల కాలంలో దేశంలో 20 కోట్ల ఉద్యోగాలు రావాలని, ఆ లెక్క ప్రకారం రాష్ట్రంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పారు. ఆ ఉదోగాలు ఇవ్వకుండా, యువతకు తీవ్ర అన్యాయం చేస్తున్నా ఎందుకు వంగి దండాలు పెడుతున్నారని జగన్‌, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లను ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదని, కనీస నిధులు కూడా విడుదల చేయలేదని అయినా బిజెపిని ఎందుకు వెనకేసుకు వస్తున్నారని నిలదీశారు. మోడీ మాయమాటలతో దేశాన్ని మోసం చేస్తున్నారని, బాబు, జగన్‌లు రాష్ట్రాన్ని ఆయనకు తాకట్టు పెడుతున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌, వామపక్షాలను గెలపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో కాంగ్రెస్‌ బలహీనంగా ఉందని ఆరోపించే మోడీ, తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. మోడీ వల్ల ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా బిజెపి పూర్తి చేసిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను చూసి మోడీ భయపడుతున్నారని అన్నారు. ‘రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ ఇస్తున్న తొలి హామీగా ఇందిరమ్మ అభయం కింద ప్రతి పేద కుటుంబానికి నెలకు ఐదు వేలు అందజేస్తాం’ అని ఆయన ప్రకటించారు.

పుట్టింటి హక్కుల సాధన కోసమే …

పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన హక్కులన్నింటిని సాధించేంత వరకు తాను వెనకడుగు వేయనని అన్నారు. ‘ నా పుట్టింటి హక్కుల సాధన కోసమే నేను కాంగ్రెస్‌ లో చేరా. ఏ పార్టీలో అయినా చేరడానికి నాకు హక్కు ఉంది. చెల్లెలు అని కూడా చూడకుండా నా మీద దాడులు చేయిస్తున్నారు. డబ్బులు పోసి సోషల్‌ మీడియాలో ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నారు. ఒకప్పుడు ఇదే చెల్లెలు 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. బారు… బారు బాబూ అంటూ ఉద్యమం చేసింది. మీ కోసం ఇదే చెల్లెలు అప్పుడు అంత కష్టం చేస్తే … ఇప్పుడు నా మీద, నా భర్త మీద నిందలు వేస్తున్నారు.’ అని షర్మిల చెప్పారు. ‘అయినా, వైఎస్‌ఆర్‌ బిడ్డ భయపడదు. ఆంధ్ర రాష్ట్ర హక్కులు సాధించే వరకు వెనకడుగు వేయను’ అని చెప్పారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బిజెపిని ఎప్పుడూ వ్యతిరేకించేవారని, అటువంటి బిజెపికి జగన్‌ ఎందుకు బానిస అయ్యారని ఆమె ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని, ప్రకృతి వైపరిత్యాల సమయంలో పంటనష్టపోతే రైతులను ఆదుకునేందుకు నాలుగు వేల కోట్లతో మరో నిధిని ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు హామీనిచ్చారని గుర్తు చేశారు. ఈ ఐదేళ్లలో ఎందుకు వాటిని అమలు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేసే పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.

భవిష్యత్‌ తేల్చే ఎన్నికలు

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ భవిష్యత్‌ను అటో… ఇటో తేల్చబోయే ఎన్నికలు త్వరలో జరగనున్నాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో మతత్వ బిజెపిని గద్దె దించాలన్నారు. ఇండియా వేదిక బిజెపికి సమాధి కట్టడానికి సిద్ధమైందని తెలిపారు. విభజన హామీలను అమలు చేయని బిజెపి, దానికి మద్దతుగా నిలిచిన వైసిపి, టిడిపి, జనసేనలను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ దేశంలోనూ, రాష్ట్రంలోనూ నియంత పాలన సాగుతోందన్నారు. అక్కడా… ఇక్కడా రెండు ప్రభుత్వాలు కూడా పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధిని విస్మరించి మతతత్వంతో ముందుకొస్తున్న బిజెపిని, దానికి మద్దతుగా రాష్ట్రంలో నిలిచిన పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎపి వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాకూర్‌, సిడబ్ల్యుసి సభ్యులు ఎన్‌.రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు, జెడి శీలం, గిడుగు రుద్రరాజు, పిసిసి మాజీ అధ్యక్షులు డాక్టర్‌ సాకే శైలజనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️