రాజధానిలో గెలుపెవరిది?

May 6,2024 00:42 #2024 election, #gunter, #mp seat
  • ఎన్‌ఆర్‌ఐపై మిర్చి వ్యాపారి పోటీ
  •  ఇండియా బ్లాక్‌ తరఫున అజయ్ కుమార్‌

ప్రజాశక్తి గుంటూరు జిల్లా ప్రతినిధి : చారిత్రక నేపథ్యం ఉన్న గుంటూరు లోక్‌సభ నుంచి ఈసారి ఎవరు ఎన్నికవుతారన్నది ఆసక్తి కరంగా మారింది. వైసిపి నుంచి కిలారి రోశయ్య, టిడిపి నుంచి పెమ్మసాని చంద్రశేఖర్‌, ఇండియా బ్లాక్‌ తరఫున సిపిఐ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌ పోటీ పడుతున్నారు. కేవలం డబ్బే ప్రామాణికంగా టిడిపి, వైసిపి అభ్యర్థుల ఎంపిక జరిగిందన్న విమర్శలున్నాయి. టిడిపి నుంచి ఎన్‌ఆర్‌ఐ పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఎంపిక చేయగా, తన ఆస్తి రూ.5,785 కోట్ల వరకు ఉందని ఎన్నికల అఫిడవిట్‌లో పెమ్మసాని చూపారు. ఆయన ఎన్నికల్లో భారీగా ఖర్చుపెడతారన్న ఉద్దేశంతో టిడిపి ఆయనకు లోక్‌సభ టికెట్టు ఇచ్చిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

పక్కా లోకల్‌ నినాదంతో రోశయ్య
కిలారి రోశయ్య పొన్నూరు వైసిపి ఎమ్మెల్యేగా ఉంటూ ఈసారి పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ఆయన మిర్చితోపాటు అనేక వ్యాపారాలు చేస్తున్నారు. పక్కా లోకల్‌ అనే నినాదంతో ఆయన ప్రచారంలో పాల్గొంటున్నారు. తాను కష్టపడి డబ్బు సంపాదించానని, ఎక్కడా రూపాయి అవినీతి చేయలేదని, భవిష్యత్తులో కూడా అవినీతి రహిత రాజకీయాలు చేస్తానని పెమ్మసాని ప్రచారంలో భాగంగా చెప్పుకెళ్తున్నారు. అలాగే గత ఎన్నికల కన్నా ఈసారి వైసిపికి కొన్ని తరగతుల ప్రజలు దూరమయ్యారు. గత ఎన్నికల ముందు తాను రాజధానిలో ఇల్లు కట్టుకుని ఉంటున్నానని, అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పిన జగన్‌ 2019 డిసెంబరులో మూడు రాజధానుల నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇందుకు వ్యతిరేకంగా రైతులు 1,600 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. అయితే వైసిపికి బలమైన ఓటు బ్యాంకు ఉందని కిలారి రోశయ్య చెబుతున్నారు.

కాంగ్రెస్‌లో నూతనోత్సాహం
షర్మిల ఎపిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ కేడర్లో కొంత ఉత్సాహం వచ్చింది. ఇండియా వేదిక తరపున గుంటూరు లోక్‌సభకు సిపిఐ నుంచి జంగాల అజయ్ కుమార్‌ పోటీ చేస్తున్నారు. వామపక్షాలు, కాంగ్రెస్‌ ఓట్లతోపాటు ఉద్యోగులు, వ్యాపారులనూ ఆయన ఆకట్టుకుంటున్నారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ.. ప్రజలతోటే ఉంటానని చెబుతున్నారు. గల్లా జయదేవ్‌ ఈసారి రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వ వేధింపులకు విసిగి ఆయన రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు.

➡️