‘అక్కడ’ గాజు గ్లాసు జనసేనకే!

  • ఇతరులకు కేటాయించం 
  • హైకోర్టుకు ఇసి నివేదన

ప్రజాశక్తి-అమరావతి : గాజు గ్లాసు గుర్తు కేటాయింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో జనసేన ఎన్నికల చిహ్న కేటాయింపు వివాదం దాదాపుగా కొలిక్కివచ్చింది. జనసేన పార్టీ పోటీ చేసే 21 అసెంబ్లీ స్థానాల్లోనూ, వాటి పరిధిలోని లోక్‌సభ సీట్లకు పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయించ కూడదని నిర్ణయించినట్లు ఇసి హైకోర్టుకు తెలిపింది. అదే విధంగా జనసేన పోటీ చేస్తున్న రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని అన్ని అసెంబ్లీ సీట్లలోనూ పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులకు, ఇతరులకు కూడా గాజుగ్లాస్‌ గుర్తు కేటాయించేది లేదని ఇసి వివరించింది. ఒకవేళ ఇప్పటికే ఈ తరహా కేటాయింపులు జరిగి ఉరటే రిటర్నింగ్‌ అధికారులు సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటారని తెలిపింది.
గాజు గ్లాసు గుర్తుపై జనసేన ఇచ్చిన వినతిపత్రంపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాసనానికి రాతపూర్వకంగా వివరించింది. దీంతో గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై జనసేన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణను ముగిస్తున్నటు హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు జస్టిస్‌ బి. కష్ణమోహన్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాము పోటీ చేయని అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్ధులకు కేటాయించకుండా, ఆ గుర్తును తమ పార్టీకే రిజర్వ్‌ చేసేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి టి.శివశంకరరావు పిటిషన్‌ దాఖలు చేశారు. ఇసి తరపు లాయర్‌ అవినాశ్‌ దేశారు అందించిన వివరాలతో జనసేన తరఫు సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ సంతప్తిని వ్యక్తం చేశారు. దీంతో న్యాయమూర్తి జనసేన వ్యాజ్యాన్ని మూసివేశారు.

అన్ని నియోజకవర్గాల్లోనూ…. : టిడిపి పిటిషన్‌
టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నందునగాజు గ్లాసు గుర్తును రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఇతరులకు కేటాయించకుండా ఇసిని ఆదేశించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. టిడిపి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ బొప్పూడి కష్ణమోహన్‌ గురువారం విచారణ చేయనున్నారు.

➡️