చంద్రబాబు హామీల్లో ఒర్జినాలిటీ లేదు : బొత్స

May 11,2024 23:50 #2024 elction, #Minister Botsa

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :టిడిపి అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒర్జినాలిటీ లేదని, తమ పథకాలన్నింటినీ ఆయన కాపీ కొట్టి మాట్లాడుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలోని లాసన్స్‌ బే కాలనీలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగులకు వైసిపి ప్రభుత్వమే మేలు చేసిందని చెప్పుకొచ్చారు. పేదలకు పథకాలు అందకుండా చేసి చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. కూటమి ఓడిపోతుందని తెలిసి ఆయనలో అసహనం పెరిగిపోతోందన్నారు. మరోపక్క పవన్‌ కల్యాణ్‌ తాను గెలిస్తే చాలని అనుకుంటున్నారని తెలిపారు. వైసిపి కుటుంబ పార్టీ అయితే చంద్రబాబుది కుటుంబ పార్టీ కాదా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు కుటుంబం తరఫున ఐదుగురు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. లోకేష్‌లా అడ్డదారిలో తాము పదవులు పొందలేదన్నారు. ప్రధాన మంత్రిని విమర్శించడానికి తన స్థాయి సరిపోనప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శించేందుకు లోకేష్‌ స్థాయి సరిపోతుందా ? అని నిలదీశారు. టిడిపిని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సర్వేలను తాను నమ్మనని, టార్గెట్‌ 175కి 175 సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. వైసిపి విశాఖ ఎంపి అభ్యర్థి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ.. తాను గెలిస్తే స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విశాఖ పరిపాలనా రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. స్టీల్‌ఫ్లాంట్‌ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని ప్రధాని మోడీ ప్రకటిస్తే తనతోపాటు గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న అమర్‌నాథ్‌ పోటీ నుంచి తప్పుకుంటామని తెలిపారు.

➡️