తొలి జాబితాలో సీనియర్లకు దక్కని చోటు

Feb 25,2024 11:40 #first list, #seniors, #TDP
  • పొత్తుల తిప్పలతో ప్రకటించని టిడిపి అధినేత

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి-జనసేన ప్రకటించిన ఉమ్మడి అభ్యర్ధుల జాబితాలో టిడిపి సీనియర్‌ నాయకులకు టిక్కెట్లు దక్కలేదు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, మండలి బుద్ధప్రసాద్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి వంటి నేతలను ప్రకటించలేదు. దీంతో ఈ నేతలంతా అసహనానికి గురయ్యారు. పొత్తులో భాగంగా కొంతమందికి కేటాయించకపోగా, ఇంటిపోరు ఉండడంతో మరికొంతమందికి మొండిచేయి చూపాల్సి వచ్చిందని పార్టీ నేతలు అంటున్నారు. ఎచ్చెర్ల నుంచి కలిశెట్టి అప్పలనాయుడు పోటీ పడటంతో కిమిడి కళా వెంకట్రావుకు జాబితాలో చోటు దక్కలేదు. రాజమండ్రి రూరల్‌ సీటును జనసేన కూడా కోరడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ప్రకటించలేదు. గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అయితే దీనిపై గంటా నిర్ణయం తీసుకోకపోవడంతో ఆపాల్సి వచ్చింది. మాజీమంత్రి బండారు సత్యనారాయణ పెందుర్తి నుంచి సీటు ఆశిస్తు న్నారు. అయితే ఈ సీటును పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిం చే అవకాశం ఉండటంతో మండలి బుద్ధప్రసాద్‌ పేరు రాలేదంటున్నారు. మైలవరం నుంచి ప్రస్తుత సిట్టింగ్‌ వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు కేటాయించే ఆలోచన అధినాయకత్వానికి ఉండటంతో మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పేరు ప్రకటించలేదు. మైలవరం వసంతకు కేటాయిస్తే దేవినేనిని పెనమాలూరు నుంచి పోటీలో దించే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. తెనాలి నుంచి జనసేన తరపున నాదెండ్ల మనోహర్‌కు కేటాయించారు. దీంతో ఆ సీటు ఆశించిన ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు మొండిచేయి తప్పలేదు. వైసిపి నేత, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి త్వరలో పార్టీలో చేరనున్నారు. గురజాల అభ్యర్ధిగా జంగాను దించాలనే ఆలోచన ఉండటంతో అక్కడ ఇన్‌చార్జ్‌గా ఉన్న యరపతినేని శ్రీనివాసరావుకు నిరాశ ఎదురైంది. అభ్యర్థుల సర్దుబాట్ల ప్రక్రియలో భాగంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఆపారు. దీంతో అక్కడ ఇన్‌ఛార్జిగా ఉన్న సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేరు తొలి జాబితాలో చోటుచేసుకోలేదు. వెంకటగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డిని ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని పార్టీ భావిస్తోంది. ఆయన మాత్రం వెంకటగిరి నుంచి గానీ, సర్వేపల్లి నుంచి గానీ పోటీ చేస్తానని అధిష్టానంతో చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన పేరు కూడా జాబితాలో చోటు దక్కలేదు. వీరితోపాటు మాజీమంత్రులు పల్లె రఘునాథ్‌ రెడ్డి, పీతల సుజాత, సీనియర్‌ నాయకులు చింతమనేని ప్రభాకర్‌ వంటి నేతల పేర్లు ప్రకటించలేదు.

➡️