గోదావరి దాటుతూ ముగ్గురు మృతి

May 12,2024 20:30 #3 death, #Konaseema

ప్రజాశక్తి-ఆత్రేయపురం(డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ) :గౌతమి గోదావరి నది దాటుతుండగా ప్రమాదవశాత్తూ ఇద్దరు మహిళలు, ఒక బాలిక మృతి చెందారు. ఈ ఘటన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆలమూరు మండలం బడుగువాని లంకకు చెందిన కర్రి సునీత (16) ఇటీవల పదో తరగతిలో మండల స్థాయిలో ప్రతిభ కనబరిచింది. ఈ నేపథ్యంలో ఆమె అదే ప్రాంతానికి చెందిన పల్లూరి సత్య అనంతలక్ష్మి (40), కప్పిరెడ్డి ఏసమ్మ (60)లతో కలిసి శనివారం వాడపల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి బయలుదేరింది. వారు ముగ్గురు మడికి వద్ద గౌతమి గోదావరిని దాటుతుండగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యారు. రాత్రయినా వారి సెల్‌ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఆచూకీ దొరకలేదు. ఆదివారం ఉదయం గల్లంతైన సమీపంలోనే మూడు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. మృతులు అనంతలక్ష్మి, ఏసమ్మ, సునీతగా గుర్తించారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ ఎస్‌ శ్రీనివాసు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

➡️