‘ఉక్కు’ ఉద్యమానికి నేటితో 1200 రోజులు

ప్రజాశక్తి -ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 1200 రోజులకు చేరుకోనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం చేపట్టే ప్రత్యేక కార్యక్రమాలను విజయవంతం చేయాలని పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, యు.రామస్వామి పిలుపునిచ్చారు. శనివారం నాటి 1199వ రోజు దీక్షలో స్టీల్‌ప్లాంట్‌ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ విభాగ కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలు, ఉద్యమాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగే వరకూ పోరు సాగిస్తామని స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే దీక్షలను విజయవంతం చేయాలని ఉక్కు కార్మిక వర్గాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జె.రామకృష్ణ, వెంకటరమణ, డిసిహెచ్‌ వెంకటేశ్వరరావు, సైన్‌బాబు, రమణ తదితరులు పాల్గొన్నారు.

➡️