స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులకు రేపు సెలవు

సిపిఎం వినతిపై స్పందించిన ఎన్నికల కమిషన్‌
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లోని కాంట్రాక్టు కార్మికులకు సోమవారం క్లోజింగ్‌ హాలిడే (వేతనంతో కూడిన సెలవు)గా ప్రకటించాలని సిపిఎం అందించిన వినతిపత్రంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పందించి చర్యలు తీసుకుంది. పోలింగ్‌ జరిగే రోజు వీరికి వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. స్టీల్‌ప్లాంట్‌లో 16 వేల మంది కాంట్రాక్టు కార్మికులు వివిధ కాంట్రాక్టు ఏజెన్సీల కింద పనిచేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జె జయరాం… రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధాన అధికారి హరీంద్రప్రసాద్‌ను సచివాలయంలో ఆదివారం సిఇఒను కలిసి వినతిపత్రం అందించారు. స్టీల్‌ప్లాంటులో 80 శాతం మంది కార్మికులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జనరల్‌ షిఫ్ట్‌లో పనిచేస్తారని తెలిపారు. ఉదయం 9 గంటల్లోపు, సాయంత్రం 5:30 గంటల తర్వాత పోలింగ్‌లో పాల్గనడం చాలా కష్టమని వివరించారు. దేశవ్యాప్తంగా ఆర్‌ఐఎన్‌ఎల్‌ విశాఖపట్నంతో సహా వివిధ బ్రాంచుల్లో పనిచేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగులకు పోలింగ్‌ తేదీన వేతనంతో కూడిన సెలవుగా ప్రకటిస్తూ సర్క్యులర్‌ జారీ చేసిందని తెలిపారు. కానీ కాంట్రాక్టు కార్మికుల విషయంలో స్టీల్‌ప్లాంటు యాజమాన్యం కాంట్రాక్టు ఏజెన్సీలకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఏజెన్సీలు ఈ అంశంపై స్పందించడం లేదని పేర్కొన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌, విఎస్‌పి యాజమాన్యం క్లోజింగ్‌ హాలిడేగా ప్రకటిస్తే కాంట్రాక్ట్‌ ఏజెన్సీలు కార్మికులకు జీతం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. కాబట్టి సోమవారం జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ను ప్రోత్సహించడం కోసం ప్లాంట్‌లోని ఆర్‌ఐఎన్‌ఎల్‌, విఎస్‌పి యాజమాన్య, కాంట్రాక్టు ఏజెన్సీలకు కూడా కాంట్రాక్టు వర్కర్లకు క్లోజింగ్‌ హాలిడే పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన కమిషన్‌ సెలవు ప్రకటించాలని, ఆదేశాలు అమలయ్యేలా చూడాలని విశాఖ జిల్లా కలెక్టరును ఆదేశించింది.

➡️