రైలు ఢీ కొని ఇద్దరు కార్మికులు మృతి

Mar 11,2024 18:08 #2 death, #Kurnool, #train
  • రైల్వే అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం
  •  మృతుల బందువులు ఆరోపణ
  •  30 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌

ప్రజాశక్తి-తుగ్గలి(కర్నూలు) : రైలు ఢీ కొని ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరోకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన గుంతకల్‌ రైల్వే డివిజన్‌ పరిధిలోని మద్దికేర తుగ్గలి రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే లైనుకు మరమ్మత్తులు చేస్తున్న ముగ్గురు ప్రైవేట్‌ రైల్వే కార్మికులను గుంతకల్‌ నుండి డోన్‌కు వెళుతున్న రైలు (07288) ఢీ కొంది. దీంతో గుజ్జుల కిష్టన్న (64), ఏకాశి ఓబులేష్‌ (42) అక్కడికక్కడే మృతి చెందారు. మరో కార్మికుడు కొప్పు.కాశీకి తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రుడుని కర్నూల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతులు రాంపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రైవేట్‌ కార్మికులు రైల్వే ట్రాక్‌పై మరమ్మతులు చేస్తున్న సమయంలో అక్కడ విధులు నిర్వహించే రైల్వే ఉద్యోగులు లేకపోవడం వల్లే ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారని మతుల బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబాలకు 30 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, అలాగే బాధ్యులైన రైల్వే అధికారులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డింమాండ్‌ చేశారు.
గుజ్జుల కిష్టన్నకు కుమారుడు ఓబులేసు, కుమార్తె సువర్ణలు ఉన్నారు. ఏకాశి ఓబులేష్‌కు భార్య లక్ష్మీదేవి, కుమార్తెలు షేకమ్మ, రాణమ్మ, కుమారుడు నరసింహలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసిపి నాయకులు నాగభూషణ్‌ రెడ్డి, టిడిపి నాయకుడు తిరుపాల్‌ నాయుడు సంఘటన స్థలానికి చేరుకుని మృతుల బంధువులను ఓదార్చారు. ఘటన స్థలాన్ని సిఆర్పిఎఫ్‌ డీఎస్‌సి మురళీ కృష్ణ, సిఐ, ఎస్‌ఐలు పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

➡️