ఆగని ‘ఉక్కు’ ప్రయివేటీకరణ కుట్రలు

Feb 26,2024 10:20 #steelplant, #vizag

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరోకేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణకు కుట్రలు కొనసాగిస్తోంది. ప్లాంట్‌ పీకనొక్కేయడానికీ అన్నిదారులూ మూసేస్తోంది. రోజువారీ అవసరాలకు సైతం ఒక్క రూపాయీ పెట్టుబడి సమకూర్చడం లేదు. పైగా, ప్లాంట్‌కు చెందిన భూములను అమ్మకానికి పెట్టాలని, ప్లాంట్‌ నిర్వహణలోని విద్యాలయాలను దశల వారీగా మూసివేయాలని కేంద్ర స్టీల్‌ మంత్రిత్వ శాఖ ఇటీవల స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యానికి మౌఖిక ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో, కార్మికవర్గం పోరాటానికి మరింత పదును పెట్టేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర సంస్థలైన ఒఎన్‌జిసి, హెచ్‌పిసిఎల్‌కు వర్తించిన విలీన విధానం ‘ఉక్కు’ రంగంలో స్టీల్‌ప్లాంట్‌-సెయిల్‌ మధ్య ఎందుకు అమలు చేయరు? కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్టీల్‌ప్లాంట్‌ సిఎండి హెచ్‌ఒడిలతో సమావేశమై కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా ప్లాంట్‌కు సమకూరే అవకాశాల్లేవని, నగదును సమీకరించుకోవాలని సూచించిందని తెలుస్తోంది.

ఉక్కు పరిరక్షణకు ప్రత్యామ్నాయాన్ని పట్టించుకోని కేంద్రం గతంలో హెచ్‌పిసిఎల్‌లో వాటాలను ఒఎన్‌జిసి సొమ్ముతో కొనిపించి రూ.27 వేల కోట్లతో హెచ్‌పిసిఎల్‌ను విశాఖలో విస్తరించారు. ప్రభుత్వ స్టీల్‌ప్లాంట్‌ అయిన స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌)ను రూ.లక్ష కోట్లతో విస్తరణ చేయడం ద్వారా 2030 నాటికి స్టీల్‌ ఉత్పత్తి దేశ అవసరాలకు తగ్గట్టు 300 మిలియన్‌ టన్నులకు విస్తరించాలని కేంద్ర స్టీల్‌ మంత్రిత్వ శాఖ విధానం. ఈ నేపథ్యంలో 20 మిలియన్‌ టన్నులకు విస్తరించాలన్న లక్ష్యం వైజాగ్‌ స్టీల్‌కు ఉన్నందున సెయిల్‌లో విలీనం చేయడం ద్వారా ఉక్కును లాభాల్లోకి తేవచ్చని కార్మికులు, కార్మిక సంఘాలు చెప్తోన్నా కేంద్రం పెడచెవిన పెడుతూ వస్తోంది.

 స్టీల్‌ యాజమాన్యం చేస్తోన్న ప్రయత్నాలేమిటి?

ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలిలోని ఫోర్జ్‌డ్‌ వీల్స్‌ ప్లాంట్‌తోపాటు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని మిగులు భూముల్లో కొంత భాగం అమ్మాలని 2023-24 ఆర్థిక సంవత్సరంలో నిర్ణయం తీసుకుంది. ఈ అమ్మకం ద్వారా రూ.3,500 కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల వరకూ నిధులు సమకూరనున్నాయని ఉక్కు యాజమాన్యం చెప్తోంది. గాజువాక, పెదగంట్యాడ, హెచ్‌బి.కాలనీ వంటి చోట్ల సిబ్బంది నివాసాల కోసం సేకరించిన భూములు స్టీల్‌ ప్లాంట్‌కు ఉన్నాయి. వీటిల్లో 22.9 ఎకరాల్లో విస్తరించి ఉన్న 588 ప్లాట్లను, రెండు ఎకరాల్లో ఉన్న 76 నివాస గృహాలను అమ్మడం ద్వారా రూ.1,500 కోట్లు వరకూ నిధులు సమీకరించుకోవచ్చని యాజమాన్యం వాదన.

రూ.5 వేల కోట్ల గ్రాంటు ఇచ్చి 5 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి : జె.అయోధ్యరామ్‌

ఉక్కు కర్మాగారం మనుగడ సాగించాలంటే కేంద్ర ప్రభుత్వం తక్షణం రూ.5 వేల కోట్ల రుణం ఇవ్వాలని, ప్లాంట్‌లో ఖాళీగా ఉన్న ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ డిమాండ్‌ చేశారు. ఉక్కు ప్రయివేటీకరణను నిరసిస్తూ పోరాటాన్ని ఉధృతం చేయనున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే దశల వారీగా పాదయాత్రలు, కార్మిక ఆందోళనలు చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలైన వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ఎన్నికల సమయంలోనైనా కనీసం మోడీపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ఆయన ప్రశ్నించారు. స్టీల్‌ కార్మికుల నేతృత్వంలో ఆదివారం ఆగనంపూడి, గంగవరం, గంట్యాడ తదితర చోట్ల పాదయాత్రలు చేశారు. ఈ నెల 27న కూర్మన్నపాలెం ఆర్చ్‌ నుంచి జివిఎంసి వరకూ వేల మంది కార్మికులతో మహా పాదయాత్ర చేపడతామని, 28న నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని చెప్పారు.

 

➡️