అఫిడవిట్‌లో తప్పులపై హైకోర్టుకెళ్తాం : ఉషశ్రీచరణ్‌

Apr 29,2024 21:48 #usha sri, #Ushasree Charan

ప్రజాశక్తి-సోమందేపల్లి (శ్రీ సత్యసాయి జిల్లా) : టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ అఫిడవిట్‌లో కనబరచని కేసులపై హైకోర్టుకు వెళ్తామని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీచరణ్‌ పేర్కొన్నారు. ఆమె సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సవితమ్మ అఫిడవిట్‌లో 17 కేసులు ఉన్నట్లు ప్రకటించారని, అవికాకుండా సొంత వదిన పద్మనారాయణరెడ్డి మీద గృహహింసకు సంబంధించిన కేసును, ఆమె తల్లి గాయిత్రిదేవి ఆస్తికి సంబంధించి పెట్టిన కేసు వివరాలను అఫిడవిట్‌లో చూపలేదన్నారు. సవితమ్మపై ఆంధ్రాలోనే కాకుండా కర్నాటకలో కూడా కేసులున్నాయని గుర్తుచేశారు. ఛీటింగ్‌, ఫోర్జరీ, 420 కేసులు ఉన్నట్లు సవితమ్మ తన అఫిడవిట్‌లో స్వయంగా పేర్కొన్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. లేపాక్షి, బెంగళూరు, రొద్దం, కియా పోలీస్‌ స్టేషన్లలో కూడా సవితమ్మపై కేసులు ఉన్నాయన్నారు. సొంత కుటుంబానికి న్యాయం చేయలేని సవితమ్మ నియోజకవర్గ ప్రజలకు ఏమి న్యాయం చేస్తుందని మండిపడ్డారు.

➡️