విశాఖ ఉక్కు జోలికొస్తే సహించేది లేదు : విమలక్క

May 3,2024 22:28 #Dharna, #visaka steel plant, #vizag

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : త్యాగాలతో ఏర్పడ్డ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించాలని చూస్తే సహించేది లేదని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలుగు రాష్ట్రాల అధ్యక్షురాలు విమలక్క అన్నారు. ‘విశాఖ ఉక్కును అమ్మడానికి వాడెవడు.. కొనడానికి వీడెవడు.. కొనేవాడిని అమ్మే వాడిని బంగాళాఖాతంలో కలిపేస్తాం’ అని ఆమె హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 1177వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్‌ డబ్ల్యుఆర్‌ఎం 1, 2 విభాగాల కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయం దారుణమని, పోరాటాలతో ఆ నిర్ణయాన్ని తిప్పికొడతామని అన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన కాంగ్రెస్‌ విశాఖ ఎంపి అభ్యర్థి పి సత్యారెడ్డి, సిపిఎం గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ పోరాటాలు, బలిదానాలు, త్యాగాలతో సిద్ధించిన విశాఖ ఉక్కు వంటి ఉన్నతమైన కర్మాగారాన్ని కారు చౌకగా అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు అమ్మే హక్కు మోడీ సర్కారుకు ఎవరిచ్చారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు దేశాభివృద్ధికి పట్టుకొమ్మలన్నారు. వాటిని నరికేసి ప్రజలకు దారిద్య్రంవైపునకు నెట్టాలని పాలకులు చూస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు కూలీ సంఘం నాయకులు కె వీరాంజనేయులు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైౖర్మన్‌ డి ఆదినారాయణ, కో -కన్వీనర్‌ జె అయోధ్యరాం, నాయకులు పరంధామయ్య, ఎన్‌ రామారావు, పెద్దిరాజు పాల్గొన్నారు.

➡️