ఓటు వేసి రక్షించుకో-ప్రజాస్వామ్యాన్ని కాపాడుకో

May 9,2024 21:02 #vote

-సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్నికల్లో ఓటర్లకు రక్షణ కల్పించి, ఓటింగ్‌ శాతం పెరిగేటట్లు కృషి చేయాలని, పోలీస్‌ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించి, తగు జాగ్రత్తలతో ఎన్నికలు సక్రమంగా జరిగేటట్లు చూడాలని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ కోరారు. ‘ఓటు వేసి రక్షించుకోాప్రజాస్వామ్యాన్ని గెలిపించుకో’ అనే అంశంపై గురువారం విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి, సినీ గేయ రచయిత జన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ప్రముఖ వైద్యులు జి సమరం తదితరులు పాల్గన్నారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ మాట్లాడుతూ.. తిరుపతి, చిత్తూరులో కొందరు పోలీసులు ప్రజలకు ఇబ్బందులు కలిగించడాన్ని ఆయన ఖండించారు. ఎన్నికల అక్రమాలను నివారించటానికి సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఎపి ఎలక్షన్‌.కామ్‌ అనే వెబ్‌సైట్‌ను రూపొందించిందని, దీనిని ఉపయోగించుకోవాలని కోరారు. జన్నవిత్తుల మాట్లాడుతూ.. ఓటును వజ్రాయుధంగా వాడాలని, ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను అభ్యర్థులందరూ పాటించాలని పిలుపునిచ్చారు. వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగం, పేదరికం, అవినీతి, హింసాత్మక సంఘటనలను రూపుమాపటానికి తోడ్పడే శక్తులను గెలిపించాలని కోరారు. ప్రొఫెసర్‌ కొండవీటి చిన్నయ్య సూరి, విజయవాడ మాజీ మేయర్‌ జంద్యాల శంకర్‌, పెన్షనర్స్‌ పార్టీ సుబ్బరాయన్‌, టి శ్రీహరి, జివి పూర్ణచంద్‌, పి రవితేజ, కోవే సంస్థ వ్యవస్థాపకులు రాధిక తదితరులు ప్రసంగించారు.

➡️