పాఠశాలల్లో ‘వాటర్‌ బెల్‌’ను పర్యవేక్షించాలి

  •  పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్‌ బెల్‌ నిర్వహణను ప్రతిరోజూ పర్యవేక్షించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. మూత్రం రంగును బట్టి శరీరంలోని నీటిలోపాన్ని గుర్తించి నీరుతాగే అలవాటును విద్యార్థులు గుర్తించేలా, అవగాహన పెంచుకునేలా పోస్టరును జతపరిచామని తెలిపారు. వీటిని పోస్టుకార్డు సైజులో ముద్రించి ప్రతి మూత్రశాల ముందు అతికించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎండ వేడిమికి విద్యార్థుల్లో డీహైడ్రేషన్‌ ముప్పును నివారించేందుకు రోజుకు మూడు సార్లు వాటర్‌ బెల్‌ మోగించాలని విద్యాశాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి సెలవుల తరువాత పాఠశాలలు తిరిగి ప్రారంభమైన తరువాత కూడా వాటర్‌ బెల్‌ విధానాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

➡️