ఆరోగ్యశ్రీ రూ.25 లక్షలకు పెంపు

Dec 16,2023 08:22 #ap cm jagan, #cabinet meeting, #speech

-18 వ తేది నుండి కొత్త కార్డుల జారీ

ఒకటి నుండి రూ. 3వేలకు సామాజిక ఫించన్లు

– విశాఖలో లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌

-డిపిఆర్‌ కేబినెట్‌ నిర్ణయాలు

-పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ సాబ్జి మృతికి క్యాబినెట్‌ 2నిమిషాలు మౌనం

-కేబినెట్‌ నిర్ణయాలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.25లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరించారు. ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచడంతో పాటు కొత్త ఫీచర్లతో 18వ తేది నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఆరోగ్యశ్రీలో 3257 రకాల వైద్య చికిత్సలు అందించాలని, ఈ ఏడాది రూ.4,400 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆరోగ్య సురక్ష క్యాంపులో వైద్యం చేయించుకున్న వ్యక్తి తిరిగి ఒక నెల తర్వాత చెకప్‌కు డాక్టర్‌ వద్దకు వచ్చివెళ్లేందుకు రవాణా ఖర్చు కింద రూ.300లు ఇవ్వాలని, అదే విధంగా ఆరోగ్యసురక్ష క్యాంపుల్లో చికిత్స పొందుతున్న వారికి మందులు సరిగా అందుతున్నాయా లేదా అన్న అంశాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు మందులు కూడా పోస్టల్‌ శాఖతో ఒప్పందం కుదుర్చుకుని, సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి పోస్టల్‌ ద్వారా విలేజ్‌ క్లినిక్‌కు పంపాలని నిర్ణయించినట్లు చెప్పారు. అక్కడి నుండి రోగికి అందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ ప్రచార కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆశావర్కర్లు, సిహెచ్‌ఓలు, ఎఎన్‌ఎమ్‌లు ,భావసారూప్యత ఉన్న వారు పాల్గనాలని కోరారు. 90శాతం కుటుంబాలకు వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ సేవలను పొందేందుకు అర్హులయ్యేందుకు వీలుగా ఏడాదికి రూ.5లక్షల ఆదాయం ఉన్న వారికి పథకాన్ని వర్తింపచేయాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.జనవరి ఒకటవ తేది నుండి 250 రూపాయలు పెంచడం ద్వారా సామాజిక ఫించన్లను 3వేలరూపాయలుగా చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు చెల్లుబోయిన తెలిపారు. :సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తాత్కాలిక ప్రాతిపదికన 928మందిని నియమించుకునేందుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. జలజీవన్‌మిషన్‌ కింద ఇంటింటికీ సురక్షిత మంచినీటిని అందించేందుకు కుళాయిల ఏర్పాటు బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పజెప్పనున్నారు. ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాన్ని మారిటైమ్‌ బోర్డు పరిధిలోకి తీసుకొచ్చేందుకు కూడా మంత్రి మండలి గ్రీన్‌ సిగలిచ్చింది. విశాఖలోని నాలుగు కారిడార్లలో 76.9 కిలోమీటర్లు పొడవైన లైట్‌ మెట్రో రైల్‌ డిపిఆర్‌కు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. యాంటీనక్సల్స్‌ స్వ్కాడ్‌కు 15శాతం అలవెన్స్‌ ఇచ్చేందుకు మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. 11 పాత వైద్యకళాశాలల్లో నాలుగు కొత్త విభాగాలు: రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న 11 వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ విభాగాలు ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ప్ర్రకాశం జిల్లా మార్కాపురంలో కూడా ఇవే సేవలందించేందుకు కూడా సంబంధిత విభాగాల ఏర్పాటుతో పాటు 287 పోస్టుల భర్తీకి కూడా మంత్రిమండలి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం,నంద్యాల కొత్త మెడికల్‌ కాలేజీల్లో గ్రైనిక్‌, పిడియాట్రిక్‌, అనస్తీషియా విభాగాల్లో 95 పోస్టుల భర్తీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సిహెచ్‌సి)ని 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించింది. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌సాబ్జీమృతికి కేబినెట్‌ సంతాపం:కేబినెట్‌ భేటీ జరుగుతున్న సమయంలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించినాడనే వార్త ముఖ్యమంత్రికి తెలియగానే ఆయనతో పాటు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం ఆయనమృతిపట్ల సిఎంతో పాటు కేబినెట్‌ మంత్రులందరూ రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. మరిన్ని నిర్ణయాలు .శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్సర్‌ విభాగాల ఏర్పాటు . డిసెంబరు21న 8వ తరగతి చదువుతున్న 4.35లక్షలమంది విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ.26నుంచి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్ర కింద క్రీడల నిర్వహణకు రూ.127కోట్లు మంజూరు.. విజయవాడ రాయనపాడులో సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి 0.20 సెంట్ల ప్రభుత్వ భూమి కేటాయింపు. .అసైన్డ్‌ భూములకు యాజమాన్యపు హక్కులు కల్పించేలా జిల్లా క లెక్టర్లకు అధికారాలు కొత్తగా ఏర్పాటు చేసిన 26 రెవిన్యూ డివిజన్లలో 26 ఎల్‌డిఓ పోస్టుల భర్తీ . అన్నమయ్య జిల్లా చిట్వేలు, కోడూరు.సంబేపల్లె మండలాల్లో జిల్లా హరిజన డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ భూములను, భూమిలేని ఎస్‌సి, ఎస్‌టి పేదలకు పంపిణీ .వంగపండు ప్రసాదరావు సతీమణి వంగపండు విజయలక్ష్మికి విశాఖపట్టణం జిల్లా పెందుర్తి మండలం నరవలో 1000 చదరపు గజాల ఇంటిస్థలాన్ని గజం రూ.10ల వంతున ఇవ్వాలని నిర్ణయం..విశాఖ పట్టణంజిల్లా మధురవాడ వద్ద 11.25 ఎకరాల భూమి బెంగళూరుకు చెందిన టిఐఎస్‌బి ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు ఎకరా కోటి రూపాయల వంతున కేటాయింపు. .స్కూల్‌లో 25శాతం సీట్లు విద్యాహక్కుచట్టం కింద, మరో 25 శాతం సీట్లు స్దానికులకు ఉచితంగా కేటాయింపు. .బీచ్‌ టూరిజం కింద పర్యాటకశాఖకు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం అక్కుపల్లి వద్ద 5 ఎకరాల భూమి కేటాయింపు. .పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం నాగూరులో మూడు సర్వే నెంబర్లలో సుమారు 10ఎకారల భూమిని సైంటిఫిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ అండ్‌ ఫిట్నెస్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు రహదారులు, భవనాల శాఖకు ఉచితంగా కేటాయింపు.

➡️