‘ తరతరాలుగా బతుకుతున్నాం.. మా పొట్టకొట్టొద్దు’ : రాతి కార్మికులు

ప్రజాశక్తి-శాంతిపురం (చిత్తూరు) : ‘ మా కడుపులు కొట్టొద్దు ‘ అని రాతి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా పోరంబోకు స్థలంలో రాళ్లను కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్న కార్మికులను ఓ ప్రైవేటు నిర్వాహకులు బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ కార్మికులు అధికారులకు విన్నవించారు.

శనివారం కార్మికులు ప్రజాశక్తి తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. దశాబ్దాల కాలం నుండి తరతరాలుగా కాలపు బండలు కొట్టుకొని జీవనం సాగిస్తున్న తమను పంచాయతీకి చెందిన బోడి బండను ఓ ప్రైవేటువారి యాజమాన్యం ఆక్రమించుకోవడంపై 64 పెద్దూరు పంచాయతీకి చెందిన రాతి కార్మికులు కంటతడిపెట్టారు. మండల పరిధిలోని 64 పెద్దూరు గ్రామపంచాయతీకి చెందిన చిన్నూరు గ్రామం వద్ద సర్వేనెంబర్‌ 123/1 గుట్ట పరంబోకు స్థలం ఉందని, ఆ గుట్టపై చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు చెందిన రాళ్లను కొట్టుకొని జీవనం చేసుకుంటున్నామని తెలిపారు. ఇటీవల ఓ ప్రైవేట్‌ వారి యాజమాన్యానికి ప్లీజ్‌ అనుమతులు వచ్చాయంటూ రాళ్లు కొట్టుకుంటున్న కార్మికులను బలవంతంగా ఖాళీ చేయించారనీ… దీంతో తమ జీవనోపాధి పూర్తిగా పోయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా ఆ బండపై రాళ్లు కొట్టుకొని జీవనం సాగిస్తున్న తమ కడుపులను కొట్టద్దని ప్రభుత్వానికి, తహశీల్దార్‌ కు విన్నవించుకున్నారు.

➡️