బిజెపి కుట్రలు అడ్డుకుంటాం

-రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం
తుక్కుగూడ జనజాతరలో రాహుల్‌గాంధీ
-కాంగ్రెస్‌ పార్టీ తెలుగు మేనిఫెస్టో ఆవిష్కరణ
-దేశంలో ప్రతి పేద మహిళకు, నిరుద్యోగికి ఏడాదికి లక్ష ఆర్థిక సాయానికి హామీ
ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :దేశ ప్రజల మధ్య మతవిద్వేషాలు రెచ్చగొట్టే బిజెపి రాజకీయ కుట్రలను అడ్డుకొంటామని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. టిపిసిసి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ శివారు తుక్కుగూడలో శనివారం తెలంగాణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగిన జనజాతర బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు కాంగ్రెస్‌ నాయకులు కెసి వేణుగోపాల్‌, దీప్‌దాస్‌మున్షి, తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఇతర నాయకులతో కలిసి కాంగ్రెస్‌ మేనిఫెస్టో ‘పాంచ్‌ న్యారు ‘తెలుగు పోస్టర్‌ను రాహుల్‌ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని, మోడీ ఆటలు సాగనీయబోమని అన్నారు. దేశ జనాభాలో 90శాతం ఉన్న బిసి, ఎస్‌సి, ఎస్‌టి, ,మైనార్టీ, పేద వర్గాలకు బడ్జెట్‌లో కేవలం ఆరు శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారని రాహుల్‌ పేర్కొన్నారు. కాంగెస్‌ మేనిఫెస్టోను ఆయన దేశ ప్రజల ఆత్మగా అభివర్ణించారు. దేశంలో ప్రతి నిరుద్యోగ యువతకు ఏడాది పాటు ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చి లక్ష రూపాయల జీతం అందజేస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు.
ప్రతి పేద కుటుంబంలో మహిళకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు వేల కోట్ల రూపాయలు రుణాలను మాఫీ చేసిందని, సామాన్యులను విస్మరించిందని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే కిసాన్‌ న్యారు కింద రైతు రుణాలు మాపీ చేస్తామన్నారు. స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు పంటల కనీస మద్దతుధరకు చట్టబద్దత కల్పిస్తామని చెప్పారు. కార్మికులు, కూలీలకు రోజుకు కనీస వేతనం రూ.400 అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేశ జనాభాలో 50శాతం ఉన్న వెనకబడిన తరగతులు, 15శాతం ఉన్న దళితులు, 8శాతం ఉన్న ఆదివాసీలు, 15శాతం ఉన్న మైనార్టీలు, ఐదు శాతం ఉన్న నిరుపేదలకు ప్రభుత్వంలో కానీ, మీడియా సంస్థల్లో కానీ, బడా వ్యాపార సంస్థల్లో భాగస్వామ్యం లేదన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలు, పారిశ్రామిక వేత్తల కోసమే పనిచేస్తుందని రాహుల్‌ విమర్శించారు. బిఆర్‌ఎస్‌ పాలన గురించి మాట్లాడుతూ ఇంటెలిజెన్స్‌, పోలీసు వ్యవస్థలను మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ దుర్వినియోగం చేశారని రాహుల్‌ విమర్శించారు. కేంద్రంలో ప్రధాని మోడీ కూడా అదే పని చేస్తున్నారని ఆరోపించారు. ఇడి బలవంతపు వసూళ్ల సంస్థగా మారిందన్నారు. దేశంలో అత్యంత అవినీతి మంత్రులు మోడీ దగ్గరే ఉన్నారనీ, ఎన్నికల కమిషన్‌లో కూడా మోడీ తన తొత్తులను నియమించారని ఆరోపించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఎలక్టోరల్‌ బాండ్స్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక కుంభకోణమని రాహుల్‌ పేర్కొన్నారు. కంపెనీల్లో తనిఖీలకు సిబిఐ వెళ్లిన కొద్దిరోజులకే ఆయా కంపెనీల నుంచి బిజెపికి విరాళాలు అందుతాయని, ఆవిధంగా సిబిఐ, ఇడిలను మోడీ ఉపయోగిస్తున్నారని విమర్శించారు. మోడీ దగ్గర ఇడి, సిబిఐ ఉంటే తమ దగ్గర దేశ ప్రజల ప్రేమాభిమానాలున్నాయని రాహుల్‌ అన్నారు. తెలంగాణలో బిజెపి బి టీమ్‌ను ఓడించామనీ, ఇప్పుడు బిజెపిని మట్టికరిపిస్తామని చెప్పారు. తెలంగాణకు తనకు కుటుంబ బంధం ఉందన్నారు
ఇండియా ఫోరమ్‌ను గెలిపించండి : రేవంత్‌ రెడ్డి
లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని తుక్కుతుక్కుగా ఓడించి ఇండియా ఫోరమ్‌ను గెలిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. జూన్‌ 9న ఢిల్లీలో మువ్వన్నెల జెండా ఎగరాలన్నారు.. ‘ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారు. పదేళ్లలో మోదీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని చెప్పారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన 750 మంది కుటుంబాలను మోడీ కనీసం పరామర్శించలేదు” అని చెప్పారు. పదేళ్లలో కేసిఆర్‌ వంద సంవత్సరాల విధ్వంసం సృష్టించారని చెప్పారు. కెసిఆర్‌ నోటికొచ్చినట్టల్లా మాట్లాడుతున్నారని, అలాగే మాట్లాడితే జైలులో పెడతామని హెచ్చరించారు.

➡️