స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ కుట్రలను తిప్పికొడతాం

Jan 30,2024 08:08 #Dharna, #visakha steel

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ కుట్రలను ఐక్య పోరాటాలతో తిప్పికొడతామని ఐద్వా విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి పద్మ, వై సత్యవతి అన్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు సోమవారానికి 1033వ రోజుకు చేరాయి. దీక్షల్లో ఐద్వా కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ విలువైన భూములను కాజేయడం కోసం మోడీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్నారు. బిజెపి ఎంపి జివిఎల్‌ నర్సింహారావు స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించడంలేదని ప్రకటనలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకపోవడం, వర్కింగ్‌ క్యాపిటల్‌ ఇవ్వకపోవడం దారుణమన్నారు. రూ.మూడు లక్షల కోట్ల విలువగల స్టీల్‌ప్లాంట్‌ను రూ.30 వేల కోట్లకు కట్టబెట్టే చర్యలకు పాల్పడడాన్ని ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. గాలి జనార్ధనరెడ్డికి ఏ పరిశ్రమా లేకపోయినా బొగ్గు గనులు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో బిజెపికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు కె వేణు, బొట్టా ఈశ్వరమ్మ, కె సంతోషం, కె కుమారి, బి భారతి, కె సుజాత, ఎం వేణమ్మ పాల్గొన్నారు.

➡️