పరిశ్రమలు నిర్మించని భూములను వెనక్కు తీసుకుంటాం

Mar 11,2024 21:53 #anathapuram, #meeting, #Nara Lokesh, #TDP
  • చేనేత వస్త్రాలపై జిఎస్‌టిని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది : లోకేష్‌
  • అనంతపురంలో ముగిసిన శంఖారావం సభలు

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : ‘లేపాక్షి నాలెడ్జి హబ్‌, సైన్స్‌ సిటీ పేరుతో రైతుల నుంచి సేకరించిన వేలాది ఎకరాల భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని, తాము అధికారంలోకి వచ్చాక ఆ భూములను వెనక్కు తీసుకుంటామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. ఆ భూముల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిఎస్‌టి వలన చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అధికారంలోకి వస్తే చేనేత వస్త్రాలపై చెల్లించాల్సిన జిఎస్‌టిని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో చేపట్టిన శంఖారావ సభలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు ఆయన అనంతపురం, తాడిపత్రి నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సభల్లో లోకేష్‌ మాట్లాడుతూ.. వైసిపి నిర్వహించిన సిద్ధం సభకు బాహుబలి టైటిల్‌ వేసి పులకేశి సినిమా చూపించారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క మాట అయినా జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం అమలు చేశాకే ఓటు అడుగుతానని చెప్పారని, ఇప్పుడు ఏం చెప్పి ఓట్లు అడుగుతారని నిలదీశారు. ఏటా డిఎస్‌సి నిర్వహిస్తామని, ఏడాదికి 6300 కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేస్తామని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేశారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఏటా పద్ధతి ప్రకారం నోటిఫికేషన్లు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. వైసిపి ఐదేళ్ల కాలంలో మైనార్టీలపై దాడులు పెరిగాయని, నంద్యాలలో ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని గుర్తు చేశారు. చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే కూతురుకంటే మైనార్టీ బాలికకు ఎక్కువ మార్కులు వస్తున్నాయని, టిసి ఇచ్చి పంపిస్తే ఆ బాలిక ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే బిసిలకు తగిన ప్రాధాన్యతను కల్పిస్తామని, ఆదరణ పథకానికి రూ. ఐదు వేల కోట్లు ఖర్చు పెడతామని హామీ ఇచ్చారు. చంద్రన్న బీమా కింద రూ. పది లక్షలు, పెళ్లి కానుక కింద రూ. లక్ష రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, తాడిపత్రి మున్సిపల్‌ చెర్మన్‌ జెసి.ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️