సంపద సృష్టించి..ప్రజలకు సంక్షేమం

May 9,2024 23:10 #chandrababu, #speech

తోటపల్లి కుడికాలువకు నిధులు మంజూరు చేస్తాం : చంద్రబాబు
ప్రజాశక్తి-చీపురుపల్లి/కురుపాం :అధికారంలోకి వస్తే తోటపల్లి కుడి కాలువకు నిధులు మంజూరు చేసి సాగునీరు అందిస్తామని టిడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అప్పులు చేసి జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కానని, తాను మాత్రం అలా చేయకుండా సంపద సృష్టించి వచ్చే ఆదాయాన్ని ప్రజలకు సంక్షేమ రూపంలో అందిస్తామని చెప్పారు. కురుపాం నియోజకవర్గంలో గుమ్మడిగెడ్డ రిజర్వాయర్‌, పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మూతపడిన పరిశ్రమలు తెరిపించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన ఎన్నికల సభల్లో ఆయన ప్రసంగించారు. వైసిపి ప్రభుత్వ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, తొమ్మిది దఫాలు విద్యుత్‌ ఛార్జీలను పెంచి ప్రజలపై భారాలు మోపిందన్నారు. వైజాగ్‌ను విజయసాయిరెడ్డి దోచేస్తుంటే బత్స సత్యన్నారాయణ ఎందుకు అడగలేదు? విజయనగరం జిల్లాలో బత్స కుటుంబీకులే ఎమ్మెల్యేలుగా, ఎంపిలుగా ఉండాలా? వేరే వారు ఉండకూడదా? అని ప్రశ్నించారు. ప్రజల జీవితాలు మార్చేందుకు సూపర్‌ సిక్స్‌ పథకాలను తీసుకొచ్చానని చెప్పారు. గిరిజనుల కోసం 16 సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని, వీటన్నింటినీ తీసేసి గిరిజనులకు సిఎం జగన్‌ అన్యాయం చేశారని విమర్శించారు. హింసా రాజకీయాలకు, అరాచక పాలనకు స్వస్తి పలకాలన్నారు. కరెంటు ఛార్జీలు, మద్య నిషేధంపై జవాబు చెప్పిన తర్వాతే జగన్‌ ఓట్లు అడగాలని డిమాండ్‌ చేశారు. మోడీ గురించి బత్స కాదు.. దమ్ముంటే జగన్‌ మాట్లాడాలన్నారు. ‘బటన్‌ నొక్కి ప్రజలకు ఇచ్చింది ఎంత.. జగన్‌ తిన్నదెంత? ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే.. ఎప్పుడూ నిజం మాట్లాడరు. మీ భూములు, ఆస్తులపై ఎవరి ఫొటో ఉండాలి. భూ పత్రాలపై రాజముద్ర కావాలా? జగన్‌ ఫొటో కావాలా? వైసిపిని ఓడిస్తే తప్ప మీ భూములకు భద్రత ఉండదు. మీ జీవితాలు, మీ పిల్లల జీవితాలు మార్చే ఆయుధం ఓటు’ అని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్‌సిపై మొదటి సంతకం, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దుకు రెండో సంతకం పెడతానని తెలిపారు. ఇసుక దోపిడీతోపాటు అన్నింటిలోనూ అక్రమాలకు పాల్పడిన స్థానిక ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిని ఓడించాలని కోరారు. అనంతరం ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ ప్రతులను దగ్ధం చేశారు. సభల్లో చీపురుపల్లి అభ్యర్థి కిమిడి కళావెంకటరావు, విజయనగరం ఎంపి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున, కురుపాంలో అరకు ఎంపి అభ్యర్థి కొత్తపల్లి గీత, అసెంబ్లీ అభ్యర్థి జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

➡️