ఒకరిని రక్షించబోయి మరొకరు – చెరువులో పడి ఇద్దరు మృతి

May 12,2024 21:02 #crime

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం (శ్రీకాకుళం జిల్లా) :చెరువులో పడి ఇద్దరు మృతి చెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిర్లంగి గ్రామానికి చెందిన కొంత మంది సమీపంలో ఉన్న చెరువులో స్నానం చేస్తున్నారు. సబితా (49) అనే మహిళ స్నానం చేస్తుండగా గుంతలోకి జారుకుంది. కాపాడంటూ కేకలు వేయడంతో సమీపంలో ఉన్న దూపాన భైరి (75) ఆమెను కాపాడేందుకు చెరువులో దూకి ఆయన కూడా చిక్కుకున్నారు. కొందరు గ్రామస్తులు గమనించి ఇద్దరినీ ఒడ్డుకి తీసుకొచ్చారు. ప్రయివేటు వాహనంలో ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా… అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️