‘విజయనగరం’ ఎవరి వశం?

May 1,2024 03:20 #2004 Elections, #vijayanagaram
  •  లోక్‌సభకు 15 మంది అభ్యర్ధులు
  • వైసిపి, టిడిపి, కాంగ్రెస్‌ మధ్యే పోటీ
  •  ఆరు అసెంబ్లీల్లోనూ ఇదే పరిస్థితి
  •  ఎచ్చెర్లలో బిజెపికి ఎదురుగాలి

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : విజయనగరం లోక్‌సభ, దాని పరిధిలోని శాసనసభ స్థానాల్లో రాజకీయ వేడి రోజురోజుకూ వేడెక్కుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం లోక్‌ సభతోపాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలు కూడా వైసిపి విజయకేతనం ఎగరవేసింది. ఈసారి కూడా కొంత సానుకూలంగా ఉన్నా వ్యతిరేకత కూడా వినిపిస్తోంది. ఎచ్చెర్ల మినహా మిగతా అన్నిచోట్లా గట్టిపోటీ ఉన్న విషయం తెలిసిందే. పార్లమెంట్‌ స్థానానికి మొత్తం 15మంది పోటీలో ఉండగా, వైసిపి తరపున సిట్టింగ్‌ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, టిడిపి అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు, కాంగ్రెస్‌ తరపున బొబ్బిలి శ్రీను ఉన్నారు. మిగిలినవారిలో ఆరుగురు స్వతంత్య్ర అభ్యర్థులు, ఇతర పార్టీలకు చెందినవారు ఉన్నారు. ప్రధానంగా వైసిపి, టిడిపి మధ్య గట్టిపోటీ నెలకొంది. ఇండియా వేదిక బలపర్చిన కాంగ్రెస్‌ అభ్యర్థి కూడా ఈసారి బలపడే అవకాశం లేకపోలేదు. ఈ ప్రభావం వైసిపిపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీరి గెలుపోటములు వీరి వ్యక్తిగత చరిష్మాపై కాకుండా, ఆయా పార్టీలవైఖరి, మెనిఫెస్టో, ఆ పార్టీల తరపున పోటీచేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థుల బలాబలాలు, ప్రచార శైలిని బట్టి ప్రభావం చూపే అవకాశాల కనిపిస్తున్నాయి. ఆ విధంగా చూస్తే మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాల్లో 87 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.


ఎచ్చెర్లలో ఎన్‌డిఎ బలపర్చిన బిజెపి అభ్యర్థికి ఎదురుగాలి వీస్తోంది. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో బొబ్బిలి మినహా ఐదుచోట్లా టిడిపిలో గ్రూపులు, ముఠాలపోరు తారా స్థాయిలో వున్నప్పటికీ వారం క్రితం చంద్రబాబు మూడు రోజుల పర్యటన తరువాత విజయనగరం అసెంబ్లీలో మినహా పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. అసంతృప్తులు, సీటు ఆశించి భంగపడ్డవారు కలిసి పనిచేస్తున్నారు. దీంతో, బొబ్బిలితోపాటు విజయనగరం, రాజాంలలో టిడిపి పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉండే అవకాశం కన్పిస్తోంది. విజయనగరంలో మాజీఎమ్మెల్యే మీసాల గీత పోటీలో ఉన్నప్పటికీ ప్రధానపోటీ వైసిపి, టిడిపి మధ్యే నెలకొంది. గీత వీరి గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు.
గజపతినగరం వైసిపిలో స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ టిడిపి అభ్యర్థి అందుకనుగుణంగా మలచుకోలేక పోతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చీపురుపల్లిలో టిడిపి అభ్యర్థి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు మధ్య గట్టిపోటీ ఉంది. కానీ, పోలింగ్‌ దశకు వచ్చేసరికి ప్రత్యర్థి ఎత్తులను బొత్స వ్యూహాత్మకంగా చిత్తుచేయగలిగే సమర్థుడనే చర్చ కూడా నడుస్తోంది.
నెల్లిమర్లలో జనసేన అభ్యర్థి లోకం మాధవికి టీడిపి నుంచి భయం పట్టుకుంది. వారంతా సహకరిస్తారా? లేదా? అనే అనుమానంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక తరగతి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈరెండు అంశాలూ వైసిపి అభ్యర్థికి అనుకూలంగా మారే అవకాశాలు ఉండొచ్చునని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజాగా బిజెపి అగ్రనాయకత్వం ఉత్తరాంధ్రకు వచ్చిన సమయంలో హిందూత్వ విషయాలను ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముస్లిములు ఎటువైపు నిలుస్తారనేది కూడా ప్రశార్థకంగా మారింది.

➡️