వేదిక అభ్యర్థులను గెలిపించండి

May 12,2024 09:27 #cpm pracharam

– ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక్క అవకాశమివ్వండి
– చివరి రోజు సిపిఎం అభ్యర్థుల ప్రచార జోరు
ప్రజాశక్తి-యంత్రాంగం :సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. చివరి రోజు సిపిఎం అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తించారు. ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఇంటింటికెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం వినిపించేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. గత నెల 18 నుంచి ఈ నెల 11వ తేదీ వరకు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుసరించిన నిరంకుశ విధానాలను ప్రజల్లో ఎండగట్టారు. సిపిఎం అభ్యర్థుల గెలుపు ఆవశ్యకతను వివరించారు.
కర్నూలు జిల్లా కల్లూరులో పాణ్యం నియోజకవర్గ అభ్యర్థి డి.గౌస్‌దేశారు విజయాన్ని కాంక్షిస్తూ రోడ్‌ షో నిర్వహించారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె ప్రభాకర్‌రెడ్డి, వి.రాంభూపాల్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.నిర్మల అభ్యర్థితో కలిసి రోడ్‌ షోలో పాల్గన్నారు. ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బిజెపి దుర్మార్గాలకు వంత పాడుతున్న టిడిపి, వైసిపిలను ఓడించేందుకు సిపిఎం కృషి చేస్తోందని తెలిపారు. కల్లూరు కాలనీలలో అభివృద్ధి శూన్యమని, గతంలో సిపిఎం ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే తప్ప ఇసుమంతైనా అభివృద్ధి చేయని ప్రస్తుత ఎమ్మెల్యేకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు.

విజయవాడ సింగ్‌నగర్‌లోని కండ్రిక, పాయికాపురం, ప్రకాష్‌ నగర్‌, పైపుల్‌రోడ్‌ తదితర ప్రాంతాల్లో సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి చిగురుపాటి బాబూరావు రోడ్‌ షో నిర్వహించారు. మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గన్నారు. కళాకారుల డప్పు వాయిద్యాలతో, మహిళలు కోలాటంతో ప్రదర్శనలు చేశారు. కండ్రిక ప్రాంతమంతా ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధి చెందాలంటే కమ్యూనిస్టులతోనే సాధ్యమన్నారు. టిడిపి, వైసిపి ప్రభుత్వాలకు ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. విజయవాడకు ఏం అభివృద్ధి చేశారని ప్రజలను ఓట్లు అడుగుతున్నారో చెప్పాలన్నారు. బిజెపిని, ఆ పార్టీకి మద్దతు తెలుపుతున్న టిడిపి, జనసేన, వైసిపి పార్టీలను ఓడించాలని కోరారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని ముస్తాబాద్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు ర్యాలీ నిర్వహించారు. తొలుత బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. అలాంటి పార్టీకి టిడిపి, జనసేన, వైసిపి మద్దతు తెలపడం దారుణమన్నారు. తనకు ఎర్రజెండా నాయకునిగా ప్రజల నుంచి ఆదరణ ఉందని తెలిపారు. ప్రజలు ఆలోచించి పని చేసే వారికి అవకాశం ఇవ్వాలని కోరారు.

అల్లూరి జిల్లా రంపచోడవరం, రాజవొమ్మంగి మండలాల్లో అరకు ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స, రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావును గెలిపించాలని కోరుతూ బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. దేవీపట్నం మండలం తాళ్లూరులో పోలవరం నిర్వాసితులతో సిపిఎం నాయకులు సమావేశమయ్యారు. తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. విఆర్‌.పురం మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
విశాఖలోని వడ్లపూడి రైల్వే క్వార్టర్స్‌లో గాజువాక అభ్యర్థి ఎం.జగ్గునాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగ్గునాయుడుకు మద్దతుగా సిపిఎం కార్యకర్తలు గాజువాకలో బైకు ర్యాలీ నిర్వహించారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో మంగళగిరి అభ్యర్థి జన్నా శివశంకరరావుకు మద్దతుగా బైక్‌ ర్యాలీ జరిగింది. ఉండవల్లి నెండర్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ మంగళగిరిలోని ద్వారకా నగర్‌, వడ్లపూడి సెంటర్‌, మిద్ది సెంటర్‌, మెయిన్‌ బజార్‌, గాలిగోపురం, గౌతమ్‌ బుద్ధ రోడ్డు, పాత బస్టాండ్‌ సెంటర్‌ మీదగా చిన్న కాకాని వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ.. లోకేష్‌ స్థానికుడు కాదని, టిడిపి ప్రభుత్వంలో మంత్రి పదవి అనుభవించి మంగళగిరికి చేసిందిలేదన్నారు. వైసిపి ప్రభుత్వం మెగా కార్పొరేషన్‌ పేరిట ఇంటి పన్నుల భారం విపరీతంగా పెంచేసి చెత్త పన్ను వేశారని విమర్శించారు. ప్రజలను ఇబ్బంది పెట్టిన పార్టీలను ఓడించాలని కోరారు.

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం వలసబల్లేరులోని గిరిశిఖర గ్రామాలైన ఆగంగూడా, వలసగూడ, వెలగమానుగూడ, చాపరాయిగూడ, వలస బల్లేరు తదితర గిరిజన గ్రామాల్లో కురుపాం నియోజకవర్గ అభ్యర్థి మండంగి రమణ ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. సిపిఎంతోనే గిరిజన హక్కులు సాధ్యమని తెలిపారు. తనతోపాటు, అరుకు ఎంపి అభ్యర్థి పి.అప్పలనర్సకు ఓటు వేయాలని అభ్యర్థించారు. బిజెపికి పొత్తు, తొత్తులుగా వ్యవహరిస్తున్నా టిడిపి, వైసిపి, జనసేనలను ఇంటికి సాగనంపాలని కోరారు. కొమరాడ మండలం కూనేరు సంతలో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ర్యాలీ జరిగింది. సాలూరులో ప్రజా కళాకారులు సిపిఎంకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శివాజీ బమ్మ జంక్షన్‌లో కళాకారులు పాటలు పాడి అలరించారు. అప్పలనర్సకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
నెల్లూరులోని జనార్థన్‌రెడ్డి కాలనీలో నగర నియోజకవర్గ అభ్యర్థి మూలం రమేష్‌ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలతో మాట్లాడారు. నెల్లూరు నగరాభివృద్ధికి తనను గెలిపించాలని కోరారు.

➡️