బిజెపితో దేశం అథోగతే నిరుద్యోగ భూతంతో భారత్‌ సతమతం

  •  ‘దేశ ఆర్థిక పరిస్థితి-మన భవిష్యత్తు’ సదస్సులో పరకాల ప్రభాకర్‌

ప్రజాశక్తి – కడప ప్రతినిధి : బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే దేశం అథోగతి పాలవుతుందని ప్రముఖ సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌ అన్నారు. ‘దేశ ఆర్థిక పరిస్థితి-మన భవిష్యత్తు’ అనే సదస్సును శనివారం కడప ఐఎంఎ హాలులో ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్‌ సి.ఓబుల్‌రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ఇటీవల 35 వేల ఖాళీలతో రైల్వే శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌కు 1.25 కోట్ల మంది దరఖాస్తు చేసుకోవడం నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. దేశంలో 83 శాతం నిరుద్యోగత ఉందని, వీరిలో 68 శాతం మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో 12 శాతం, జపాన్‌లో ఆరు శాతం, కొరియాలో మూడు శాతం నిరుద్యోగులను ఉన్నారని వివరించారు. జి20 సమావేశాల అనంతరం ప్రధాని 83 కోట్ల మందికి ఐదు కిలోల చొప్పున పిడిఎస్‌ పంపిణీ చేస్తామని ప్రకటించడం విస్మయాన్ని కలిగించిందని తెలిపారు. జి20 సమావేశాల నినాదమైన వసుదైక కుటుంబ నినాదంలో మణిపూర్‌ రాష్ట్రానికి చోటు లేదని ఎద్దేవా చేశారు. అమెరికా అక్రమ వలసదారుల్లో భారతీయులే 93 వేల మందితో అగ్రస్థానంలో ఉన్నట్లు అమెరికన్‌ రికార్డులు చెబుతున్నాయని, ఇందులో 23 వేల మంది వైబ్రంట్‌ గుజరాతీయులే ఉన్నారని ఎత్తి చూపించారు. హర్యానా ఎన్నికలొస్తే వ్యవసాయ నల్లచట్టాలను ఎవరికీ చెప్పకుండా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారని, ఎన్నికలు అయిపోగానే మళ్లీ ప్రవేశపెట్టారని, ఎవరు ఉపసంహరించమన్నారని, ఎవరు ప్రవేశపెట్టమన్నారో తెలియడం లేదని విమర్శించారు. సమాజంలో కులాల, మతాల మధ్య విద్వేషాగ్నుల్ని రెచ్చగొట్టి దేశాన్ని అతలాకుతలం చేస్తున్నారని విమర్శించారు. ఎలక్టోరల్‌ బాండ్లు ప్రపంచంలో ఎక్కడా లేని అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. అంతకు ముందు ఎకనమిక్‌ రీసెర్చ్‌ స్టూడెంట్‌ మల్లె భాస్కర్‌ మాట్లాడుతూ.. ప్రపంచ ఐదవ ఆర్థిక వ్యవస్థగా దేశం ఎదిగిందని పేర్కొనడంలో డొల్లతనాన్ని ఏకరువు పెట్టారు. కార్యక్రమంలో ఎపి సిటీజన్‌ ఫోరం కో-కన్వీనర్‌ లకీëరాజా, వైద్యులు రాజావెంగల్‌రెడ్డి, సునీత, సుదర్శన్‌రెడ్డి, మేధావులు, విద్యావంతులు పాల్గొన్నారు.

➡️