వైసిపి రెండో జాబితా విడుదల

Jan 3,2024 10:53 #YCP, #ycp incharges
ycp incharges change 2nd list
  • మూడు పార్లమెంటు, 24 అసెంబ్లీలకు ఇన్‌చార్జీలు
  • గోరంట్ల మాదవ్‌కు నో
  • ఇద్దరు మంత్రులకు స్థాన చలనం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి 2024 ఎన్నికలకు నియోజకవర్గ ఇన్‌చార్జీల రెండో విడత జాబితాను ప్రకటించింది. మూడు పార్లమెంటు స్థానాలకు, 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను మారుస్తూ.. మంగళవారం ఆ పార్టీ ప్రకటన చేసింది. ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో జాబితాను ప్రకటించారు. మంత్రులు కెవి ఉషశ్రీ చరణ్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు స్థానచలనం చేశారు. అలాగే ముగ్గురు ఎంపిలు మార్గాని భరత్‌, వంగా గీత, తలారి రంగయ్య, గొడ్డేటి మాధవిని అసెంబ్లీలకు పంపారు. ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పేర్ని నాని, భూమన కరుణాకర్‌రెడ్డి, ఎంపి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తమ వారసులకు స్థానాలు ఇప్పించుకున్నారు. అనంతపురం పార్లమెంటుకు మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురానికి జె శాంత, అరకు పార్లమెంటుకు కె భాగ్యలక్ష్మిని ఇన్‌ఛార్జులుగా ప్రకటించారు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రాజాం నియోజకవర్గానికి టి రాజేష్‌, అనకాపల్లికి ఎం భరత్‌కుమార్‌, పాయకరావుపేటకు కంబాల జోగులు, రామచంద్రాపురానికి పిల్లి సూర్యప్రకాష్‌, పి గన్నవరం నియోజకవర్గానికి వి వేణుగోపాల్‌, పీఠాపురం వంగా గీత, జగ్గంపేట తోట నరసింహం, ప్రత్తిపాడుకు పరుపుల సుబ్బారావు, రాజమండ్రి సిటికి మార్గాని భరత్‌, రాజమండ్రి రూరల్‌కు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పోలవరం నియోజకవర్గానికి తెల్లం రాజ్యలక్ష్మి, కదిరికి బిఎస్‌ మగ్బూల్‌ అహ్మద్‌, ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి టి చంద్రశేఖర్‌, ఎమ్మిగనూర్‌కు మాచాని వెంకటేష్‌, తిరుపతికి భూమన అభినయ్ రెడ్డి, గుంటూరు ఈస్ట్‌కు షేక్‌ నూరి ఫాతిమ, మచిలీపట్నం నియోజకవర్గానికి పేర్ని కృష్ణమూర్తి, చంద్రగిరికి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, పెనుగొండకు మంత్రి ఉషశ్రీ చరణ్‌, కళ్యాణదుర్గం నియోజకవర్గానికి తలారి రంగయ్య, అరకుకు గొడ్డేటి మాధవి, పాడేరుకు ఎం విశ్వేశ్వరరాజు, విజయవాడ సెంట్రల్‌కు వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్‌కు షేక్‌ అసీఫ్‌లను ప్రకటించారు.

➡️