12th fail చిత్రంపై పలువురు ప్రశంసలు

Jan 18,2024 16:07 #12th Fail, #movie

ఇంటర్నెట్‌డెస్క్‌ : ముంబయి అడిషనల్‌ కమిషనర్‌గా ఉంటున్న మనోజ్‌ శర్మ జీవిత కథ ఆధారంగా ’12 ఫెయిల్‌’ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని దర్శకుడు విధు వినోద్‌ చోప్రా తెరకెక్కించారు. ఈ చిత్రంలో మనోజ్‌ పాత్రలో విక్రాంత్‌ మస్సే నటించారు. ఇక ఆయన భార్య జోషి పాత్రలో మేధా శంకర్‌ నటించారు. ఈ చిత్రం గతేడాది అక్టోబర్‌ 27వ తేదీన విడుదలై సంచలనం సృష్టించింది. ఈ చిత్రంపై కమల్‌హాసన్‌, హీరో రిషబ్‌శెట్టి, అనీల్‌ కపూర్‌, రాణిముఖర్జీ వంటి పలువురు సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురింపించారు. తాజాగా ఈ మూవీని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా వీక్షించారు. ఇదొక గొప్ప సినిమా సినిమా అని.. ఇందులో అత్యద్భుతంగా నటించిన విక్రాంత్‌ మిస్సేను మహీంద్రా ప్రశంసించారు.

కాగా, మనోజ్‌ది మధ్యప్రదేశ్‌ రాష్ట్రం మొరానాబాద్‌ జిల్లాలోని బిల్‌గ్రామ్‌ అనే గ్రామం. తండ్రి వ్యవసాయ శాఖలో చిరుద్యోగిగా పనిచేస్తున్న సమయంలో తన పై అధికారి అక్రమాలను బయటపెట్టినందుకుగాను అతను సస్పెండ్‌ అయ్యాడు. దీంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడింది. ఆ సమయంలోనే మనోజ్‌ ఇంటర్‌ పరీక్షలకి హాజరయ్యాడు. మనోజ్‌ చదువుకున్న బడులు తమ పాస్‌ పర్సంటేజీని ఎక్కువగా చూపించడం కోసం విద్యార్థుల చేత మాస్‌ కాపీయింగ్‌ చేయించడం ఆనవాయితీగా ఉండేది. మనోజ్‌ సహా మిగతా విద్యార్థులందరూ యథేచ్చగా పరీక్షలు చూసి రాస్తుంటే.. దుష్యంత్‌ సింగ్‌ అనే సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌ (ఎస్‌డిఎం) అక్కడికొచ్చి కాపీయింగ్‌ని ఆపేశాడు. దీంతో విద్యార్థుల్లో కేవలం ఇద్దరే పాసయ్యారు. మనోజ్‌ ఒక్క హిందీలో తప్ప మిగతా సబ్జెక్టులో ఫెయిలయ్యాడు. అయితే మనోజ్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయినా.. తాను కూడా ఆ అధికారిలా అవ్వాలని కలలు కన్నాడు. సివిల్స్‌కి ప్రిపేరయి కమిషనర్‌గా అయ్యాడు. ఎన్నో కష్టాలను దాటుకుని తాను అధికారి అవ్వడం.. మరో సివిల్స్‌ అధికారిణే జోషిని వివాహమాడడం నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలిచారు. మనోజ్‌ జీవితం గురించి ఆయన మాజీ రూమ్మేట్‌ పాండే ఉరఫ్‌ అనురాగ్‌ పాథక్‌ ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’ అనే పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకం ఆధారంగానే అదే టైటిల్‌తో దర్శకుడు విధూ వినోద్‌ మూవీని తెరకెక్కించారు.

 

➡️