మూడు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా..

Jan 23,2024 12:02 #Kuno National Park, #Three cubs

భోపాల్‌ :  మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో నమీబియా నుంచి తీసుకొచ్చిన జ్వాలా అనే చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది. 20 రోజుల క్రితం నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆశా అనే మరో చీతా కూడా మూడు పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మంగళవారం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ” జ్వాల మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఇటీవలే ఆశ కూడా చిరుత కూనలకు జన్మనిచ్చింది. చీతాల సంఖ్య పెరగడం హర్షణీయం. దేశవ్యాప్తంగా ఉన్న వన్యప్రాణుల ప్రేమికులందరికీ అభినందనలు. వీటి సంఖ్య మరింత వృద్ధి చెందాలని ఆశిస్తున్నా ” అని పోస్ట్‌ చేశారు. తల్లి వద్ద మూడు చీతాలు ఆడుకుంటున్న వీడియోను షేర్‌ చేశారు. కొత్తగా పుట్టిన ఈ మూడు పిల్లలతో కలిపి కునో నేషనల్‌ పార్క్‌లో మొత్తం చిరుతల సంఖ్యను 20కి చేరుకుంది.

గతేడాది మార్చిలో జ్వాలా అనే చిరుత నాలుగు పిల్లలకు జన్మనివ్వగా.. వాటిలో ఒకటి మాత్రమే ప్రాణాలతో ఉంది. ప్రాజెక్ట్‌ చీతా కింద నమీబియా, దక్షిణాఫ్రికాల నుండి ఈ చీతాలను కేంద్ర ప్రభుత్వం భారత్‌కు తీసుకువచ్చింది. ఎనిమిది చిరుతలతో కూడిన మొదటి బ్యాచ్‌ను  సెప్టెంబర్‌ 2022లో భారత్‌కు తీసుకు రాగా, గత ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుండి 12 చిరుతలతో కూడిన రెండో బ్యాచ్‌ను తీసుకువచ్చింది. వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో విడిచిపెట్టారు.

➡️