బిజెపికి దెందులూరు

Apr 19,2024 05:31 #alliance, #BJP, #denduluru, #JanaSena, #TDP
  • టిడిపికి అనపర్తి!
  •  ఆలోచనలో కూటమి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి-జనసేన-బిజెపి కూటమిలో మరోసారి మార్పులు, చేర్పులు జరగనున్నాయి. అరకు, పి గన్నవరం, నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన తరువాత మార్పులు జరిగాయి. ఇప్పుడు కూడా మరికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉండే అవకాశం ఉంటుందని టిడిపి నేతలు అంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, దెందులూరు, ఉమ్మడి విశాఖపట్నంలోని మాడుగుల, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు జరగొచ్చు. శనివారం లోపు మార్పులు చేసిన అభ్యర్థులతో జాబితా ప్రకటించే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా అనపర్తి సీటు బిజెపి పోటీ చేసేందుకు కూటమి మధ్య అంగీకారం కుదిరినట్లు తెలిసింది.
బిజెపి అభ్యర్థి శివకృష్ణరాజు వైసిపి అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డికి పోటీ ఇవ్వలేకపోతున్నారనే నిర్ణయానికి కూటమి నేతలు వచ్చారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేస్తున్న రాజమండ్రి లోక్‌సభ పరిధిలో ఈ నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గంలో ఓట్లు పడకపోతే లోక్‌సభ స్థానానికి కూడా పడవనే ఆందోళన ఆమెలో ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. కాబట్టి అనపర్తి నియోజకవర్గాన్ని టిడిపికి అప్పగించి మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని బరిలో దించాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నియోజకవర్గానికి బదులు దెందులూరును బిజెపికి అప్పగించాలనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ టిడిపి అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్‌ను ఆ పార్టీ ప్రకటించింది. బిజెపి నుంచి తపన చౌదరి టికెట్‌ కోసం ఆ పార్టీపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో అనపర్తి, దెందులూరు నియోజకవర్గాలను మార్పు చేసుకున్నట్లు తెలిసింది. మాడుగుల అభ్యర్థిగా పైలా ప్రసాద్‌ను ప్రకటించిన టిడిపి ఇప్పుడు మార్చేందుకు నిర్ణయం తీసుకుంది.
మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు టికెట్‌ ఇవ్వనుంది. మడకశిర నుంచి ఎంఇ సునీల్‌కుమార్‌కు బదులు పార్టీ ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు ఎంఎస్‌ రాజును ప్రకటించనుంది. బాపట్ల ఎంపిగా ఎంఎస్‌ రాజు పేరును ప్రకటించాల్సి ఉంది. చివరి నిమిషంలో బిజెపి నేత కృష్ణప్రసాద్‌ పార్టీ కండువా కప్పుకోకుండానే ప్రకటించింది. బాపట్ల బదులు ఎంఎస్‌ రాజును మడకశిర అభ్యర్థిగా నిర్ణయించింది. వీటితోపాటు మరో రెండు నియోజకవర్గాల్లో మార్పులు ఉండొచ్చనే చర్చ నడుస్తోంది.

➡️