పరారిలో ఎమ్మెల్యే పిన్నెల్లి-లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ

– తెలంగాణా, ఎపి పోలీసుల ఉమ్మడి గాలింపు
-అరెస్ట్‌ వదంతులతో మాచర్లలో ఉద్రిక్తత
ప్రజాశక్తి-యంత్రాంగం:ఇవిఎం ధ్వంసం చేస్తూ వెబ్‌ కెమెరాకు చిక్కిన మాచర్ల ఎంఎల్‌ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నారు. బుధవారం రాత్రి పది గంటల వరకు ఆయన ఆచూకీ దొరకలేదు. దీంతో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఉమ్మడిగా ఆయన కోసం గాలిస్తున్నారు. అంతకుముందు సంగారెడ్డి జిల్లాలో ఆయన పోలీసులకు దొరికారని, ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్యప్రాంతానికి తరలించి విచారిస్తున్నారని వార్తలు వచ్చాయి. దీంతో మాచర్లలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం నుంచి మాచర్ల, రెంటచింతల, కారంపూడి, పాలవాయి ప్రధాన రహదారుల వెంట ఉన్న దుకాణాలు, షాపులను మూసివేశారు. అయితే, తమకు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి దొరకలేదని, ఆయన వాహనాలను, కొందరు అనుచరులను అదుపులోకి తీసుకున్నామని సంగారెడ్డి పోలీసులు ప్రకటించారు.
విదేశాలకు వెళ్లేందుకు యత్నం
మంగళవారం నుండు అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేంతవరకు అరెస్ట్‌ కాకూడదని ఆయన భావించినట్లు చెబుతున్నారు. ఈ విషయమై పక్కా సమాచారం అందడంతో బుధవారం ఉదయమే రాష్ట్ర పోలీసులు ఆయనపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ు హైదరాబాద్‌, చెన్నరు, బెంగుళూరు, ముంబాయి తదితర విమానాశ్రయాలను అలెర్ట్‌ చేశారు. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌ చేసేందుకు అడిషనల్‌ ఎస్‌పి స్థాయి అధికారులతో ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
కాల్‌డేటా సిగల్స్‌తో గుర్తింపు
ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో మంగళవారం రాత్రి నుండే పిన్నెల్లి కోసం గాలింపు చర్యలను పోలీసు అధికారులు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా కాల్‌డేటా సిగల్స్‌ సహాయంలో ఆయన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర పోలసులు తెలంగాణ స్ఫెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఛేజింగ్‌ జరిగిందని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పారిపోయేందుకు శక్త మేర ప్రయత్నించారని వార్తలు వచ్చాయి, ఈ క్రమంలో పోలీసులు పిన్నెల్లికి చెందిన వాహనాలను, పలువురు అనుచరులను, డ్రైవర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పిన్నెల్లి స్వయంగా ధ్వంసం చేశారు : టిడిపిఏజెంటు నంబూరు
పోలింగ్‌ రోజున ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వారు గేటు వద్ద ఉన్న పోలింగ్‌ కేంద్రంలోకి దూసుకువచ్చారని టిడిపి ఏజెంటు నంబూరు శేషగిరిరావు తెలిపారు.బుధవారం ఆయన మాచర్లలో మీడియాతో మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రంలోకి వచ్చిన వెంటనే నేరుగా ఈవిఎం మిషన్‌ వద్దకు వెళ్లి మిషన్‌ను నేలకేసి కొట్టారని తెలిపారు. అడ్డుకున్న తనపై వైసిపి కార్యకర్తలు దాడి చేశారని తెలిపారు. ఎమ్మెల్యే పిన్నెల్లి తనకు వేలు చూపిస్తూ బెదిరించారని తెలిపారు. పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు.
ఏడేళ్లు శిక్ష- సిఇఓ ముఖేష్‌కుమార్‌ మీనా
ఇవిఎం ధ్వంసం ఘటనలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కనీసం ఏడేళ్లు జైలు శిక్ష పడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. మీడియా ప్రతినిధులతో బుధవారం ఉదయం మాట్లాడిన ఆయన ఈ సంఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర అగ్రహంతో ఉందని, భవిష్యత్తుల్లో ఇటువంటి సంఘటనలు చేయడానికి ఇతరులు సాహించకుండా కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించిందని చెప్పారు. ఈ సంఘటనలో ఐపిసి కింద 143,147,448,427,353,452,120 బిసెక్షన్లతో పాటు పిడి పిపి చట్టం కింద మరో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇవిఎమ్‌ల ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉందని, డేటా భద్రంగా ఉండటం వల్ల కొత్త ఇవిఎమ్‌లతో పోలింగ్‌ కొనసాగించామన్నారు. ఘటన జరిగినమరుసటి రోజు ఆధారాలను పోలీసులకు అప్పజెప్పామన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు చేసిన దాడిగా కేసు నమోదుకావడంతో వెబ్‌క్యాస్ట్‌ను పరిశీలించి ఈనెల 20న పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారని సిఇఓ తెలిపారు. అదే రోజు రెంటచింతల కోర్టులో ఎస్‌ఐ మెమో దాఖలు చేశారన్నారు. సిట్‌కు పోలీసులు అన్ని వివరాలు అందించారన్నారు. నిందితుల కోసం గాలింపు జరుగుతోందని త్వరలోనే నిందితులను అరెస్ట్‌ చేస్తారని భావిస్తున్నామన్నారు.

➡️