వృద్థిని పెంచి చూపడం తప్పు

Mar 27,2024 21:05 #Business

ప్రధాని మోడీ లక్ష్యం నెరవేరదు..!
కొత్త ప్రభుత్వానికి సవాళ్లే..
భారత్‌లో వియాత్నం కంటే తక్కువ అక్షరాస్యత
చిప్‌ల రాయితీల కంటే ఉన్నత విద్యపై వ్యయం తక్కువ
ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌
న్యూఢిల్లీ : భారత్‌ను 2047 నాటికి అభివృద్థి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం నెరవేరకపోవచ్చని ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ అన్నారు. మోడీ ఆశయాన్ని ఆయన కొట్టిపారేశారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల్లో డ్రాప్‌అవుట్‌ శాతం అధికంగా ఉండి.. చాలా మందికి హైస్కూల్‌ విద్య లేకపోతే ఆ ఆశయం గురించి మాట్లాడటమే వ్యర్థమన్నారు. భారత్‌లో అక్షరాస్యత శాతం వియత్నాం వంటి ఇతర ఆసియా దేశాల కంటే తక్కువగా ఉందని గుర్తు చేశారు. రాజన్‌ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ”ప్రభుత్వం వృద్థి రేటును పెంచి చూపుతోంది. దేశం ఆ హైప్‌ (కృత్రిమ పెంపు)ను నమ్మడం అతిపెద్ద తప్పు. హైప్‌ నిజమని నిర్ధారించుకోవడానికి మనకు ఇంకా చాలా సంవత్సరాలు పట్టచ్చు. దేశం ఆ సామర్థ్యాన్ని చేరుకోవడానికి గణనీయమైన నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన అతిపెద్ద సవాలు శ్రామిక శక్తి, నైపుణ్యాలను మెరుగుపరచడం. ఈ సవాలును పరిష్కరించకుంటే యువత ప్రయోజనాలను కాపాడటంలో తీవ్ర కష్టాలు పడాల్సి వస్తుంది. దేశంలోని 140 కోట్ల జనాభాలో సగానికి పైగా 30 ఏళ్లలోపు యువతే ఉన్నారు.” అని రాజన్‌ అన్నారు.
ప్రతీ ఏడాది స్థిరమైన 8 శాతం వృద్థిని సాధించడానికి దేశం మరింత ఎక్కువ పని చేయాల్సి ఉందన్నారు. దేశంలో ఉన్నత విద్య కోసం కంటే చిప్‌ల తయారీకి రాయితీలపై ఎక్కువ ఖర్చు చేసేందుకు మోడీ ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను రఘురామ్‌ రాజన్‌ తప్పుపట్టారు. భారత్‌లో సెమీకండక్టర్‌ కంపెనీలకు రాయితీల కింద సుమారు రూ. 76 వేల కోట్లు కేటాయించగా.. ఉన్నత విద్య కోసం రూ.47 వేల కోట్లనే కేటాయించడాన్ని ఆయన విమర్శించారు. ”కరోనా తర్వాత భారతీయ పాఠశాల పిల్లల అభ్యాస సామర్థ్యం 2012 కంటే ముందు స్థాయికి పడిపోయింది. మూడో తరగతి విద్యార్థుల్లో 20.5 శాతం మంది పిల్లలు మాత్రమే రెండో తరగతి పాఠాన్ని చదవగలుగుతున్నారని అనేక రిపోర్టులు పేర్కొన్నాయని రాజన్‌ గుర్తు చేశారు. ”మనకు పెరుగుతున్న శ్రామిక శక్తి ఉంది.. కానీ వారు మంచి ఉద్యోగాలలో ఉపాధి పొందితేనే అది డివిడెండ్‌. ముందుగా శ్రామిక శక్తిని మరింత ఉపాధి పొందేలా చేయాల్సిన అవసరం ఉంది. రెండవది నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించాలి.” అని రాజన్‌ అన్నారు. భారతదేశ పాలక వ్యవస్థ చాలా కేంద్రీకృతమైందని.. రాష్ట్రాలకు నియంత్రణను అప్పగించడం ద్వారా అభివృద్థిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని సూచించారు.

➡️